కృత్రిమ మాంసం తక్షణ అవసరం

25 Aug, 2018 02:50 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న మనేకా గాంధీ. చిత్రంలో సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

ఒకట్రెండు ఏళ్లలో అందుబాటులోకి: మనేకా గాంధీ 

పశుపోషణ ఆపేస్తే భూతాపానికి చెక్‌ 

పశువుల వల్ల పెరుగుతున్న మీథేన్‌ ఉద్గారాలు 

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ వ్యాఖ్యానించారు. ఒకట్రెండేళ్లలో ఈ మాంసం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నామని అధిక శాతం ప్రజలు పలు సర్వేల్లో తెలిపినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో శుక్రవారం ‘ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ప్రొటీన్‌’పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశుపోషణకు ఫుల్‌స్టాప్‌ పెట్టి కృత్రిమ మాంసం ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన తరుణం ఇదేనన్నారు.  

పశుపోషణ ఆపేస్తే నాలుగేళ్లలో భూతాపాన్ని అరికట్టొచ్చని చెప్పారు. భూతాపానికి మీథేన్‌ కూడా ఓ కారణమని, పశుపోషణ వల్ల మీథేన్‌ ఉద్గారాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. వరిసాగు, బొగ్గు మండించడం ద్వారా కూడా మీథేన్‌ వెలువడుతుందని పేర్కొన్నారు. అయితే కోళ్లు, గొర్రెలు, మేకల వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్‌ ఉద్గారాలు తగ్గుతాయన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం కాకముందే పశువుల పెంపకాన్ని ఆపేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

జంతువుల నుంచి కొన్ని కణాలను తీసుకుని బయోరియాక్టర్లలో వృద్ధి చేయడం ద్వారా తయారయ్యే ఈ మాంసం ప్రకృతి వనరులెన్నింటినో ఆదా చేస్తుందని తెలిపారు. మాంసంలో చేరుతున్న కొన్ని రకాల వైరస్‌ల కారణంగా కేన్సర్లు వస్తున్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నట్లు 53 శాతం మంది తెలిపినట్లు ఫొర్నెలిటిక్స్‌ సంస్థ సర్వే చెబుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల సంఖ్యలో పశువులను పంపిణీ చేస్తున్న విషయంపై మాట్లాడుతూ.. గతంలో ఏపీలోనూ ఇదే తరహా ప్రయత్నం చేశారని ఇంటికో ఆవు పంపిణీ చేస్తే అందులో 90 శాతం కబేళాలలకు తరలిపోయాయని గుర్తు చేశారు. 

మొక్కల నుంచి ఇలా..! 
ప్రోటీన్లు అధికంగా ఉండే మొక్కలు, వృక్షాల ఉత్పత్తులను తీసుకుని ల్యాబుల్లో మాంసంగా తయారు చేస్తారు. చూసేందుకే కాదు.. తినేందుకు కూడా అచ్చు మాంసంలాగే ఉంటుంది. 

జంతువుల నుంచి ఎలా? 
ఆరోగ్యవంతమైన జంతువులను సరైన మంచి పరిసరాల్లో పెంచి వాటి నుంచి కొన్ని కణాలను తీసుకుని ల్యాబ్‌ల్లో అభివృద్ధి చేసి, దాని నుంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. కృత్రిమ మాంసం తినడం వల్ల ఎలాంటి వ్యాధుల రావని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

‘కృత్రిమ మాంసం ఉత్పత్తి విషయంలో పరిశోధనలను ముమ్మరం చేసి, వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు గుడ్‌ ఫుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రయత్నం చేస్తోంది. ఈ రంగంలోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ మొక్కల ఆధారిత మాంసం, కృత్రిమ మాంసం ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నాం.’ 
–వరుణ్‌ దేశ్‌పాండే, గుడ్‌ఫుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

‘కృత్రిమ మాంసం ఎలా తయారు చేయొచ్చో శాస్త్రవేత్తలకు తెలుసు. జంతువుల నుంచి కాకుండా మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుంటుంది. కొబ్బరి నీళ్లు, తేనె వంటి వాటి పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే కృత్రిమ మాంసంలో కణాలు మినహా మరే ఇతర జంతు సంబంధిత పదార్థాలు ఉండవు’    
– పవన్‌ కె.ధర్, కృత్రిమ బయాలజీ విభాగం, జేన్‌యూ, ఢిల్లీ

‘కృత్రిమ మాంసం తయారీని వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేయడం ఎలా అన్నది ఒక సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో కృత్రిమ మాంసం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం’ 
– రాకేశ్‌ మిశ్రా, డైరెక్టర్‌ సీసీఎంబీ, హైదరాబాద్‌ 

‘పశుపోషణ కారణంగా పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంత ఇంత కాదు. ఈ నేపథ్యంలో జంతువులను చంపాల్సిన అవసరం లేకుండా కావాల్సిన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించే టెక్నాలజీలను ప్రొత్సహించాల్సి ఉంది.’ 
– సౌమ్యారెడ్డి, జంతు ప్రేమికురాలు

మరిన్ని వార్తలు