నేటి ప్రజా ఆందోళనల్లో విశేషాలెన్నో!

6 Jan, 2020 18:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు చూస్తుంటే ఒకప్పటి నవ నిర్మాణ ఉద్యమం, జయ ప్రకాష్‌ నారాయణ్‌ ఉద్యమాలు గుర్తొస్తున్నాయి. ఆ రెండు ఉద్యమాలకు యువకులు, విద్యార్థులు నాయకత్వం వహించగా, నేటి ఉద్యమానికి కూడా ఆ ఇరు వర్గాలు నాయకత్వం వహించడంతోపాటు యువతులు కూడా పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావడం విశేషం. నాటి నవ నిర్మాణ్‌ ఉద్యమం ఎక్కువగా గుజరాత్‌  రాష్ట్రానికే పరిమితం కాగా, జేపీ ఉద్యమం గుజరాత్, బిహార్, హిందీ భాషా రాష్ట్రాలకు కూడా విస్తరించింది. 

ఎన్‌ఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఈశాన్య రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించడం గమనార్హం. దేశవ్యాప్తంగా నగరాల నుంచి పట్టణాలు, గ్రామాల నుంచి వీధుల వరకు విస్తరించాయి. ఇలాంటి ఆందోళనలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది వందకన్నా ఎక్కువ సార్లు ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేసింది. ఇంటర్నెట్‌ వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రజా ఆందోళనలకు కేంద్ర నాయకత్వం అంటూ ఒకటి లేదు. ఎక్కడికక్కడ ప్రజలు సంఘటితం అవుతున్నారు. అందుకనే పండుగలు, పబ్బాలప్పుడు, పెళ్లిళ్లు పేరంటాలప్పుడు, పట్టభద్రుల్లా వేడకలప్పుడు కూడా ఆందోళనలకు కొనసాగుతున్నాయి. 

గతంలో రాజకీయ ఉద్యమాలన్నీ ప్రజలకు బోరు కొట్టేవి. రొటీన్‌ నినాదాలు చీకాకు కలిగించేవి. ఈసారి అలా కాకుండా సృజనాత్మకతతో సాగుతున్నాయి. వ్యంగ్య కార్టూన్లు, వంగ్య నినాదాలతో హోరెత్తడమే కాకుండా సినిమా క్లిప్పింగ్‌ల వీడియోలతో మారుమ్రోగుతున్నాయి. కళాత్మక రూపాల్లో కొనసాగుతున్నాయి. ఒక్క ముస్లింలే కాకుండా వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడానికి కారణం దేశ ఆర్థిక పరిస్థితి పతనం కావడం. దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సీఏఏ, ఎన్నార్సీ లాంటి కొత్త సమస్యలను తీసుకరావడం ఏమిటన్నది వారి వాదన. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల ప్రార్థనల సందర్భంగా వారికి రక్షణగా వారి హిందూ మిత్రులు మానవ హారంలా నిలబడుతుండడం మరో విశేషం. 

చదవండి: 

దేశ భద్రత కోసమే ఎన్ఆర్సీ బిల్లు: ప్రహ్లాద్ మోదీ

సీఏఏ, ఎన్నార్సీ వద్దే వద్దు

చట్టాలతో మూలవాసులకు కాస్త చోటూ కరువే!

ఆందోళనకు ఊపిరి పోస్తున్నపాటలు

నేతల ఇంటి ముందుముగ్గులు

ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బొమ్మా బొరుసే

మరిన్ని వార్తలు