అధికార లాంఛనాలతో ముగిసిన జైట్లీ అంత్యక్రియలు

25 Aug, 2019 15:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని నిగమ్‌  బోధ్‌ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని  స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.   మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో  ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడుతున్నారు.

మరిన్ని వార్తలు