‘అనామకుల బిడ్డ, ప్రముఖుల కొడుకు మధ్యే పోరు’

28 Nov, 2018 12:02 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీపై జైట్లీ తీవ్ర విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ : నెహ్రూ- గాంధీ ఇంటి పేరునే కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ బ్రాండ్‌గా చేసుకుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విమర్శించారు. అనామకుల బిడ్డ అయిన మోదీ, ఘన చరిత్ర కలిగిన తల్లిదండ్రుల కొడుకు రాహుల్‌ గాంధీ మధ్యే 2019 లోక్‌సభ ఎన్నికల పోరు జరుగుతుందంటే,  తాము ఆ సవాలుకు సిద్ధమేనన్నారు. ‘సర్దార్‌ పటేల్‌ తండ్రి పేరు ఏమిటి?’ అనే శీర్షికతో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో జైట్లీ ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్‌ లాంటి వారసత్వ పార్టీకి ప్రతిభ, పనితీరుతో సంబంధం లేదని, ఆ కుటుంబం చుట్టూ చేరేవారే పార్టీ కేడర్‌ అని అన్నారు.

ప్రతిభకు అక్కడ చోటులేదు..
‘భారత్‌లో వారసత్వ ప్రజాస్వామ్యం ఉండాలా? అనే అంశంపై కాంగ్రెస్‌ చేసిన చర్చ సెల్ఫ్‌ గోల్‌తో ప్రారంభమైంది. ప్రముఖుల కుటుంబ మూలాలు కలిగి ఉండటం వారి(కాంగ్రెస్‌) దృష్టిలో ఒక సానుకూల విషయం అవుతుంది. సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చే లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌ పెట్టే నాయకత్వ పరీక్షలో విఫలమవుతారు. ప్రతిభ, నైపుణ్యం, చొరవ చూపే తత్వం లాంటి గుణాలు వారికి పట్టవు. కేవలం ఇంటిపేరునే కాంగ్రెస్‌ రాజకీయ బ్రాండ్‌గా పరిగణిస్తోంది’ అని జైట్లీ పేర్కొన్నారు.

కొందరు మేధావులకు కూడా వారి పేర్లు తెలియవు
జాతిపిత మహాత్మా గాంధీ తండ్రి పేరు, పటేల్‌ తండ్రి, భార్య పేరు ఏంటని అడిగితే కొందరు మేధావులకు కూడా సరిగా తెలియదని జైట్లీ ఎద్దేవా చేశారు. దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో పట్టణాలు, నగరాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, స్టేడియాలు ఇలా అన్నింటికీ గాంధీ కుబుంబీకుల పేర్లు పెట్టడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆ ఒక్క కుటుంబానికే భారత రాచరిక హోదా ఇచ్చారని ఎద్దేవా చేశారు. గొప్ప త్యాగాలను చేసిన వారిని సైతం విస్మరించి ఒకే కుటుంబాన్ని కీర్తించడం దేశానికి, ఆ పార్టీకి ప్రమాదకరమన్నారు.
 

మరిన్ని వార్తలు