ఈసారి ‘రైతన్న’ బడ్జెటే!

19 Jan, 2019 03:42 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ బడ్జెట్‌లో రైతులకు భారీగా తాయిలాలు ప్రకటించాలని యోచిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెటే అయినా చిన్న, సన్నకారు రైతుల్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకునే చాన్సుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం యోచిస్తున్న చర్యల్లో..పంట సాగుకు ముందే నగదు రూపంలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేయడం లాంటివి ఉన్నట్లు తెలుస్తోంది. పంటల దిగుబడులు పెరిగినా ధరలు తగ్గకుండా ఉండేందుకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే వీలుంది.

దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభ నివారణకు ఇటీవల బీజేపీ జాతీయ మండలి తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతులకు చేసిన దాని పట్ల బీజేపీ వర్గాలే సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలంటే వ్యవసాయ రంగానికి ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీపై ఒత్తిళ్లు అధికమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఏడాది ప్రకటించే బడ్జెట్‌ సంప్రదాయాల్ని తోసిరాజని, వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టామని జైట్లీ ఇటీవల∙అన్నారు. రైతులకు భారీ పథకం ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సింగ్‌ చెప్పారు.

ప్రభుత్వ ప్రణాళికల్లో కొన్ని
1. రైతులకు నేరుగా నగదు రూపంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ
2. రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు
3. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు

మరిన్ని వార్తలు