సోనియాకు అరుణ్‌ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్‌ ఇదే

26 Aug, 2019 22:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీగా ఉన్న రాయ్‌బరేలి నియోజకవర్గానికి ఓ బహుమతిని ఇచ్చాడు. తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి 200 సోలార్ విద్యుత్ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం కోసం రాయ్ బరేలీ జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై బీజేపీ నాయకుడు హీరో బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. ‘జైట్లీ చనిపోయే కొద్ది రోజుల ముందు ఆగస్టు 17న రాయ్‌బరేలీ జిల్లా కలెక్టర్‌కు ఈ సిఫారసులు అందాయి’ అని పేర్కొన్నారు. ఆయన ఈ లేఖ జూలై 30న, అంటే ఆస్పత్రిలో చేరడానికి ముందు రాసినట్టు ఉంది. కాగా తనకు జైట్లీ నుంచి సిఫారసులు అందినట్టు రాయ్‌బరేలీ జిల్లా కలెక్టర్ నేహ శర్మ తెలిపారు. ఎంపీలాడ్స్ నిధుల కింద ఎంపీలు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏటా రూ.5 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంటుంది.

(చదవండి : జైట్లీకి కన్నీటి వీడ్కోలు)

 గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) ఈ నెల 24న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్‌బోధ్‌ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు జరిగాయి.

>
మరిన్ని వార్తలు