అరుణ్‌ జైట్లీకి అనారోగ్యం

6 Apr, 2018 02:00 IST|Sakshi

మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆర్థికమంత్రి

కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయనున్నట్లు సమాచారం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ(65) మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో గురువారం ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సమస్య గురించి పూర్తిగా వివరించకుండా.. ‘కిడ్నీ సంబంధిత సమస్యలు, కొన్ని ఇన్‌ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను. భవిష్యత్‌ చికిత్సను డాక్టర్లు నిర్ధారిస్తారు’ అని మాత్రమే జైట్లీ ట్వీట్‌ చేశారు. అయితే, జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుందని ఎయిమ్స్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కిడ్నీ దాతకు సంబంధించిన విధి, విధానాలు కూడా పూర్తయ్యాయని తెలిపాయి. డాక్టర్ల సలహాతో త్వరలో జైట్లీ ఎయిమ్స్‌లో కొత్తగా నిర్మించిన అత్యాధునిక కార్డియో–న్యూరో టవర్‌లో అడ్మిట్‌ అయ్యే అవకాశం ఉంది. జైట్లీ కుటుంబానికి సన్నిహితుడైన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా సోదరుడు, అపోలో ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ సందీప్‌ గులేరియా జైట్లీకి ఆ ఆపరేషన్‌ చేస్తారని తెలిసింది. 2014లో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత బరువు తగ్గేందుకు బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోవడమే ప్రస్తుత సమస్యకు కారణమై ఉండొచ్చని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మాక్స్‌ ఆసుపత్రిలో ఆ సర్జరీ జరిగినప్పటికీ.. ఆపరేషన్‌ అనంతరం పలు సమస్యలు రావడంతో అప్పట్లోనే ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. జైట్లీ చాన్నాళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు  గుండె ఆపరేషన్‌ కూడా జరిగింది. జైట్లీ ఈ సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జైట్లీ.. అనారోగ్యం కారణంగా ఏప్రిల్‌ 2న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికీ హాజరుకాలేదు. లండన్‌లో ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్‌–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనాల్సిన ఆయన, ఆ పర్యటనను కూడా రద్దుచేసుకున్నారు.

మరిన్ని వార్తలు