విషమంగానే జైట్లీ ఆరోగ్యం

18 Aug, 2019 03:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన లైఫ్‌ సపోర్ట్‌ సిస్టంపై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ శనివారం జైట్లీని పరామర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్‌ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ధనోవా ఆసుపత్రికి వచ్చారు. శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్‌ ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయలేదు. ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌ షా జైట్లీని పరామర్శించారు.  


ఎయిమ్స్‌ నుంచి వెలువడుతున్న పొగ

ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం..
ఎయిమ్స్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. 34 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. ప్రమాద సమయంలో ఎయిమ్స్‌లో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు విఘాతం కలిగిందని రోగుల బంధువులు అన్నారు. మంటలు చెలరేగిన పై అంతస్తులో ఉన్న కొందరు రోగులను వేరే భవనానికి తరలించారు. టీచింగ్‌ భవనంలో విద్యుత్‌ సంబంధిత పనులు జరుతుగున్న  మైక్రోబయాలజీలోని వైరాలజీ యూనిట్‌లో మంటలు ప్రారంభం అయినట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు