నెహ్రూ, ఇందిర హయాంలో జరిగిందేంటి..?

10 Jun, 2018 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ను సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్రం తిప్పిపట్టడంపై వెల్లువెత్తిన విమర్శలను కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు. గతంలో న్యాయమూర్తులపై పెత్తనం చెలాయించిన, తీర్పులను ప్రభావితం చేసిన కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

జస్టిస్‌ జోసెఫ్‌ నియామకంపై సిఫార్సును పునఃపరిశీలించాలని కేంద్రం ఆయన పేరును తిప్పిపంపడాన్ని కాంగ్రెస్‌లో కొందరు నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొన్ని అంశాలపై కేంద్రం తన అభిప్రాయాలను కొలీజియం దృష్టికి తీసుకురావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని అన్నారు.

గతంలో కాం‍గ్రెస్‌ హయాంలో న్యాయమూర్తులపై ప్రభుత్వం పెత్తనం చెలాయించిన తీరు, తీర్పులను ప్రభావితం చేయడం, సుప్రీం కోర్టు సూచనలను విస్మరించడం వంటి ఉదంతాలెన్నో జరిగాయని జైట్లీ గుర్తుకుతెచ్చారు. నెహ్రూ, ఇందిర హయాంలలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తుల నియామకంపై చేసిన సిఫార్సులను పెడచెవినపెట్టారని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో జైట్లీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు