‘ఆధార్‌తో రూ 90 వేల కోట్లు ఆదా’

6 Jan, 2019 16:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ దేశ ముఖచిత్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆధార్‌తో ఆదా అయిన డబ్బుతో ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మూడు భారీ కార్యక్రమాలను చేపట్టే వెసులుబాటు కలిగిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధార్‌ను సమర్ధంగా అమలు చేస్తే, గత యూపీఏ సర్కార్‌ దీని అమలును సరిగ్గా పర్యవేక్షించలేదన్నారు.

ఆధార్‌ ప్రయోజనాల పేరుతో జైట్లీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ సబ్సిడీల పంపిణీలో ఆధార్‌ వాడకంతో గత కొన్నేళ్లుగా రూ 90 వేల కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. ఆధార్‌ వినియోగంతో భారత్‌ ఏటా రూ 77,000 కోట్లు ఆదా చేయవచ్చని వరల్డ్‌ బ్యాంక్‌ తన డిజిటల్‌ డివిడెండ్‌ నివేదికలో పొందుపరిచిందన్నారు. ఆధార్‌ ద్వారా ఇప్పటివరకూ రూ 1,69,868 కోట్ల సబ్సిడీ బదిలీ జరిగిందని చెప్పారు.

ఆధార్‌ వినియోగంతో దళారుల ప్రమేయం లేకుండా నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళుతోందన్నారు. భారత్‌లోనే ఈ వినూత్న టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. ఆధార్‌ వాడకం ద్వారా ఆదా అవుతున్న మొత్తం పేదల సంక్షేమానికి చేరుతోందని చెప్పుకొచ్చారు. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే 21 కోట్ల పాన్‌కార్డు కలిగిన వారిని వారి ఆధార్‌ నెంబర్లతో అనుసంధానించిందన్నారు.

మరిన్ని వార్తలు