అరుణాచల్‌ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి

24 Feb, 2019 16:19 IST|Sakshi

ఇటానగర్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మరణించిన ఘటన అనంతరం అరుణాచల్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ బంగళాను ఆందోళనకారులు దగ్ధం చేశారు. జిల్లా కమిషనర్‌ నివాసాలకు సైతం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎస్పీ స్ధాయి పోలీస్‌ అధికారికి గాయాలయ్యాయి.

అరుణాచల్‌ప్రదేశేతర షెడ్యూల్డ్‌ తెగలవారికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ ప్రైవేటు నివాసంపైనా ఆందోళనకారులు దాడి చేశారు. మరోవైపు ఘర్షణలు తీవ్రమవుతుండటంతో సైన్యాన్ని రప్పించగా, వారు ఇటానగర్‌లో కవాతు నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు నగరంలో అంతర్జాల సేవలను నిలిపివేసి కర్ఫ్యూ విధించారు.

>
మరిన్ని వార్తలు