గాంధీవి కులపోకడలు: అరుంధతీ రాయ్

20 Jul, 2014 02:01 IST|Sakshi
గాంధీవి కులపోకడలు: అరుంధతీ రాయ్

తిరువనంతపురం: మహాత్మాగాంధీపై ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ కులతత్వ ధోరణులను అనుసరించార ని విమర్శించారు. గాంధీ పేరుతో ఉన్న సంస్థలకు ఆ పేరు మార్చే సమయం ఆసన్నమైందన్నారు. గురువారం తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... మహాత్మాగాంధీ యూనివర్సిటీ(కేరళలోని ప్రముఖ వర్సిటీ)ని సూచిస్తూ దాని పేరు మార్చాలన్నారు.

భారత్‌లో హీరోల(మహానుభావులు)కు కొదవలేదని, కానీ వారంతా నకిలీలేనని అభిప్రాయపడ్డారు. 1936లో ‘ఆదర్శనీయ భాంగి’ పేరుతో గాంధీ రాసిన వ్యాసాన్ని ఉదహరించారు. అందులో గాంధీ భారత్‌ను ప్రస్తావిస్తూ పారిశుద్ధ్య పనివారు మూత్రాన్ని, మలాన్ని ఎరువుగా మార్చాలని సూచించారని, ఇది హరిజనుల పట్ల ఆయన విధానాన్ని తెలియజేయడంతో పాటు, కులాధిపత్య ధోరణి బలోపేతానికి ఎలా తోడ్పడిందో సూచిస్తోందన్నారు. గాంధీ గురించి పాఠాల్లో నేర్చుకున్నదంతా అబద్ధమన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ నేత గులాంనబీ అజాద్ తప్పుబట్టారు. గాంధీజీని కులతత్వవాది అంటే క్షమించరాదన్నారు

మరిన్ని వార్తలు