ఆ పదమే నచ్చడం లేదు: అరుంధతీ రాయ్

5 Nov, 2015 13:07 IST|Sakshi
ఆ పదమే నచ్చడం లేదు: అరుంధతీ రాయ్

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ జాతీయ అవార్డులు వెనక్కి ఇస్తున్న రచయితలు, మేధావులు, కళాకారుల సరసన ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేరుతున్నారు. 1989లో ఫీచర్ ఫిల్మ్‌కుగాను తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ఆమె ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కాలమ్‌లో వెల్లడించారు. ‘ఇన్ విచ్ అన్నీ గీవ్స్ అండ్ దోస్ వన్స్’ అని చలనచిత్రానికి అరుంధతీ రాయ్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు.

 మైనారిటీలపై దాడులు, హేతువాదుల హత్యలు, భావ ప్రకటనా స్వేచ్ఛకు బెదిరింపులు, గోమాంసంపై బలవంతపు నిషేధానికి వ్యతిరేకంగా మేధావులు, కళాకారులు, రచయితలు నేడు ఓ రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అసాధారణం, అద్భుతమని వ్యాఖ్యానించారు. ఆ ఉద్యమానికి తనవంత సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతోనే తాను జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చివేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

 ఇందులో రాజకీయాలేవీ లేవని, కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనే విషయంతో తనకు ప్రమేయం లేదని, దేశంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు తనను కలవరపరుస్తున్నాయని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో తాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. నేడు సమాజంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులకు ‘అసహనం’ అనడం తనకు నచ్చడం లేదని, అంతకన్నా పెద్ద పదమే ఉపయోగించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

 దర్శకుడు కుందన్ షా కూడా....
 అరుంధతీరాయ్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించిన బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా కూడా తనకిచ్చిన జాతీయ అవార్డును కూడా వెనక్కి ఇచ్చివేస్తానంటూ ప్రకటించారు. ‘జానే బీ దో యారో’ చిత్రానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఇది కాంగ్రెస్-బీజేవీ మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, ఆ పార్టీలు ఒకటేనని అన్నారు. ‘పోలీస్ స్టేషన్’ అనే సీరియల్‌ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు