‘మనం బుల్లెట్లు ఎదుర్కోవడానికి పుట్టలేదు’

26 Dec, 2019 12:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్‌ఆర్‌పీ అనేది ఎన్‌ఆర్‌సీకి డేటాబేస్‌గా ఉపమోగపడుతుందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. దీన్ని దేశప్రజలు వ్యతిరేకించాలని ఆమె తెలిపారు. అరుంధతి రాయ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుంధతి రాయ్ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీని ముస్లీంలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిందని ఆమె మండిపడ్డారు. ఎన్‌ఆర్‌పీ పేరుతో అధికారులు మీ ఇళ్లలోకి వచ్చి మీకు సంబంధించిన పేరు, ఫోన్‌నంబర్‌, ఆధార్‌కార్డు నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్‌లను అడిగి నమోదు చేసుకుంటారు. ఆ సమయంలో అధికారులకు మీకు సంబంధించిన సరైన వివరాలను వారికి చెప్పవద్దన్నారు. మనం బుల్లెట్లు ఎదుర్కొవడానికి ఇక్కడ పుట్టలేదని అరుంధతి రాయ్ ధ్వజమెత్తారు.

కాగా రాంలీల మైదానంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ అన్నీ అబద్దాలు చెప్పారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మోదీ ఎన్‌ఆర్‌సీ గురించి ఏం మాట్లాడకుండా.. దేశంలో ఎటువంటి నిర్బంధ శిబిరాలు లేవన్నారని ఆమె దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వం ఎన్‌ఆర్‌పీ పేరుతో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను ప్రజలపై రుద్దాలనుకుంటుందని అరుంధతి రాయ్ మండిపడ్డారు. వాటిని ఎదుర్కొవాలంటే అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు పోరాడాలని ఆమె పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింలపై అనేక దాడులకు జరుగుతున్నాయని.. అక్కడ పోలీసులు ముస్లిం ప్రజలను దోపిడి గురి చేస్తున్నారని అరుంధతి రాయ్ తెలిపారు.

మరిన్ని వార్తలు