‘గుర్తుకు తెచ్చుకో.. నువ్వే అడిగావు నన్ను’

12 May, 2017 12:01 IST|Sakshi
‘గుర్తుకు తెచ్చుకో.. నువ్వే అడిగావు నన్ను’

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్న కపిల్‌ మిశ్రా తల్లి, ఒకప్పటి బీజేపీ నేత అన్నపూర్ణ మిశ్రా బహిరంగ లేఖ రాశారు. అందులో కేజ్రీవాల్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. అంతకుముందు నిరాహార దీక్షలో ఉన్న కపిల్‌ మిశ్రా ఉదయాన్నే ఓ ట్వీట్‌ చేశారు. ‘మా అమ్మ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఏదో చెప్పాలనుకుంటుంది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

అరవింద్‌ను ఉద్దేశించి కపిల్‌ తల్లి ఏం రాశారంటే.. ‘ఇంకా ఎన్ని అబద్ధాలాడతావు కేజ్రీవాల్‌.. ఇంకెన్ని.. కొంచెం దేవుడికైనా భయపడు. నా కొడుకు నిన్ను ప్రశ్నిస్తాడనిగానీ, ఆ ప్రశ్నలను తప్పించుకుంటావనిగానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడు కలుసుకున్నా ప్రజాజీవితంలో సత్యంగా ఉండాలనే విషయాన్నే చెబుతావు. గుర్తుకు తెచ్చుకో.. కపిల్‌ను నీ పార్టీ పార్టీలోకి తీసుకుంటానని నువ్వే నా ఇంటికి వచ్చి అడిగావు.. పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయాలన్నావు.. కానీ కపిల్‌ మాత్రం ఉద్యమంలోనే భాగస్వామ్యం అవుతానని చెప్పాడు. కానీ, నువ్వు కపిల్‌ అవసరం తనకు చాలా ఉందని చెప్పావు. కానీ, ఇప్పుడు ప్రజలంతా నిన్ను అవినీతిపరుడని అంటున్నారు.. నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావు. నువ్వు కపిల్‌తో ఉన్నావు. కానీ వాడిని అర్ధం చేసుకోలేదు. వాడు తీవ్ర బాధతో ఉన్నాడు. మూడు రోజులుగా ఏమీ తినడం లేదు. ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాను.. అతడు ఏ సమాచారం అడుగుతున్నాడో అది ఇచ్చేయ్‌. అతడు ఎవరి ఏజెంటూ కాదు.. ఒక్క నిజానికి తప్ప’ అంటూ ఆమె హిందీలో లేఖ రాశారు.

>
మరిన్ని వార్తలు