ఎల్జీ ఆఫీసులో కేజ్రీవాల్‌ నిద్ర

13 Jun, 2018 02:04 IST|Sakshi

మంత్రులతో సహా అక్కడే బైఠాయించి ఆందోళన

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వినూత్న రీతిలో ఆందోళనకు దిగి సంచలనం సృష్టించారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) కార్యాలయం వద్ద మంత్రివర్గ సహచరులతో కలసి రాత్రి నిద్ర చేశారు. ఐఏఎస్‌ అధికారుల సమ్మె విరమణ సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మంత్రులు గోపాల్‌ రాయ్, జైన్‌.. ఎల్జీ అనిల్‌ బైజాల్‌ను కలిశారు.

ఆయన వారి డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాత్రి ఎల్జీ కార్యాలయంలోనే నిద్రించి నిరసన తెలిపిన కేజ్రీవాల్‌.. వాటికి ఆమోదం తెలిపేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఇదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌  ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

ఢిల్లీ ప్రజల కోసమే ఆందోళన: కేజ్రీవాల్‌
ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ’నా కోసం ఆందోళన చేయడం లేదు, ఢిల్లీ ప్రజల కోసమే చేస్తున్నా’ అని అన్నారు.  ఎల్‌జీ ఆదేశాల మేరకే అధికారులు పనిచేయడం మానుకున్నారని, దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, ముఖ్యంగా రేషన్, గుడిసెవాసులకు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజోపయోగ పనులు నిలిచిపోయాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

తాము సమ్మె చేయడం లేదని, రోజువారీ పనులు చేస్తూనే ఉన్నామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కారణం లేకుండానే చేస్తున్న ఆందోళన ఇదని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కేజ్రీవాల్‌ అకారణంగా ఆందోళన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ విమర్శించారు. మరోవైపు, కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరుల అనూహ్య ధర్నతో ఎల్జీ ఆఫీసు వెలుపల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌ నివాస్‌కు చేరుకునే రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఐఏఎస్‌ల వివాదమిదీ..
ఈ ఏడాది ఫిబ్రవరి 21 న ఆప్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఐఏఎస్‌లు నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఇదే సమయంలో వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇది వివాదానికి దారితీసింది. దీంతో విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేస్తున్నారు. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయినా ఆందోళన బాట మాత్రం వీడలేదు. గతంలో సామాజిక కార్యకర్తగా పనిచేసిన కేజ్రీవాల్‌.. పెరుగుతున్న విద్యుత్‌ బిల్లులపై షీలాదీక్షిత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్‌ స్తంభం ఎక్కి నిరసన తెలియజేశారు.

మరిన్ని వార్తలు