పరిస్థితి ఆందోళనకరం: అమిత్‌ షాతో భేటీ

11 Jun, 2020 08:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ప్రాణాంతక కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ వైద్యశాఖ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పాజిటివ్‌ కేసుల సంఖ్య  32,810 చేరింది. బుధవారం ఒక్కరోజే 1370కి పైగా కరోనా కేసులు నిర్ధారణ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మరణాల సంఖ్యా అంతే పెరుగుతోంది. వైరస్‌సోకి ఇప్పటి వరకు 984 మంది మృత్యువాతపడ్డారు. ఇక జూలై చివరిలోపు ఒక్క ఢిల్లీలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 5లక్షలు దాటే అవకాశం ఉందని వైద్య అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఈ క్రమంలో ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో గురువారం భేటీ కానున్నారు. (బాధితుల కంటే రికవరీ ఎక్కువ)

కరోనా వ్యాప్తి, వైద్య సేవలు, వైరస్‌ నివారణ చర్యలు వంటి అంశాలపై వీరిద్దరు చర్చించనున్నారు. వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదని వైద్యులు, అధికారులు కేజ్రీవాల్‌కు వివరించారు. వీటిపై కూడా అమిత్‌ షాతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తూ ఉండడంతో వైరస్‌ కూడా విస్తరిస్తోంది. 24 గంటల్లో 9,985 కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 2,76,583కి చేరుకుంది. ఇక కొత్తగా 279 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,745కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. (వెనక్కి తగ్గిన సీఎం.. ఎల్జీ ఆదేశాలు అమలు!)

మరిన్ని వార్తలు