అన్‌లాక్‌ 1.0: ఢిల్లీ సరిహద్దులు మూసివేత

1 Jun, 2020 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐదో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీగా సడలింపులు ఇస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌-5కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు వెల్లడించిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెలూన్లు తిరిగి తెరుచుకోవచ్చని, అయితే స్పాలు తెరుచుకోడానికి మాత్రం అనుమతి తెలిపారు. అన్‌లాక్‌ 1.0 లో భాగంగా కేంద్రం అనుమతించిన అన్ని సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు రాష్ట్ర ఢిల్లీ సరిహద్దుల మూసివేత కొనసాగుతుందన్నారు. కేవలం అత్యవసర సరుకుల వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. (కేంద్ర కేబినెట్‌ కీలక భేటీ.. చరిత్రాత్మక నిర్ణయాలు?)

సరిహద్దులను తెరిచే విషయంలో ప్రజల నుంచి సూచనలు స్వీకరించిన తరువాత ఒక వారంలో మళ్లీ నిర్ణయం తీసుకుంటామన్నారు. సరిహద్దుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు అందిచాల్సిన ఢిల్లీ ప్రజలు 8800007722 నెంబర్‌కు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు వాట్సాప్‌ లేదా మెయిల్‌ చేయాలని కోరారు. అలాగే ఉత్తర ప్రదేశ్, హర్యానాతో సరిహద్దులను తెరవడంపై ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సలహాలు కోరింది. రాష్ట్రంలోని అన్ని రకాల దుకాణాలను తెరుచుకోడానికి అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. (భారత్‌లో కొత్తగా 8,392 కరోనా కేసులు)

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన రంగాలను దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇటీవల వివరణాత్మక మార్గదర్శకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో భారీ సడలింపులు కూడా ప్రకటించింది. కాగా భారత్‌లో కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉండగా, 5,300 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఢిల్లీలో కేసుల సంఖ్య 10,893కు చేరింది. కరోనాతో 470 మంది మరణించారు.

>
మరిన్ని వార్తలు