మార్చి1 నుంచి కేజ్రీవాల్‌ నిరవధిక దీక్ష

23 Feb, 2019 17:37 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి1 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో దీక్ష చేయనున్నట్టు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా ప్రకటిస్తామంటూ గత 20 ఏళ్లుగా బీజేపీ , కాంగ్రెస్ చెబుతూనే వస్తున్నాయనీ.. కానీ ఎప్పుడూ ఆ పార్టీలు మాట నిలబెట్టుకోలేదని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరిస్తే.. యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు ప్రజలకు ఇళ్లు, మహిళలకు భద్రత లభిస్తాయన్నారు.

ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంటి ముందు మంత్రులతో కలిసి కేజ్రీవాల్ మెరుపు ధర్నా చేశారు. సుమారు ఆరుగంటల పాటు.. అర్ధరాత్రి దాటాక కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయ వెయిటింగ్‌ రూంలో వేచిచూసినా ఆయన మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో.. అక్కడే సోఫాలో నిద్రపోయారు. శాసనసభలో కూడా ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు.
 

మరిన్ని వార్తలు