కాబోయే సీఎం కేజ్రీ అనుకోండి

11 Jan, 2017 03:27 IST|Sakshi
కాబోయే సీఎం కేజ్రీ అనుకోండి

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో సిసోడియా

మొహాలీ(పంజాబ్‌): ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎంగా ఎన్నుకోబోతున్నాం అనుకుని ఓటు వేయాలని ఆ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పంజాబీలను కోరారు. ఆయన మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ‘పంజాబ్‌ సీఎం ఎవరవుతారని నన్ను జనం అడుగుతున్నారు. కేజ్రీవాల్‌ సీఎం కాబోతున్నారని నమ్మండి. ఎన్నికల్లో మా పార్టీ ఇచ్చే హామీలను ఆయన అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తారు’ అని అన్నారు. సీఎం ఎవరైనా హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేజ్రీవాల్‌పై ఉందని, దీనికి తాను హామీ ఇస్తానని చెప్పుకొచ్చారు.

పంజాబ్‌లో తమ పార్టీ.. సీఎం అభ్యర్థిని ప్రకటించదని కేజ్రీవాల్‌ చెబుతూ వస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఆయన అన్నట్లు తెలుస్తోంది. సిసోడియా ప్రకటనపై ఆప్‌ వెంటనే స్పందించింది. పంజాబ్‌లో కేజ్రీ తమ పార్టీ ముఖమని, దీనర్థం తాము గెలిస్తే ఆయన సీఎం అవుతారని కాదని పార్టీ నేత అతిషి మార్లేనా అన్నారు. కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలకు అంకితమై ఉంటారని పేర్కొన్నారు. కాగా, పంజాబ్‌కు సీఎం కావాలన్న కేజ్రీవాల్‌ అధికార దాహానికి సిసోడియా ప్రకటన నిదర్శనమని శిరోమణి అకాలీ, కాంగ్రెస్, బీజేపీలు విమర్శించాయి.

మరిన్ని వార్తలు