కేజ్రీవాల్‌కు అవమానం.. సాయం చేసిన బీజేపీ మంత్రి

28 Dec, 2018 13:09 IST|Sakshi

న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆకతాయిల చేతిలో టార్గెట్‌ అవుతూనే ఉన్నారు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇంక్‌ నుంచి కారం పొడి చల్లడం వరకూ అన్ని రకాల అవమానాలు చవి చూశారు. కానీ గురువారం కేజ్రీవాల్‌కు ఎదురైన పరాభవం వీటన్నింటిని మించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘క్లీన్‌ గంగ’ కార్యక్రమం మాదిరిగానే యుమునా నదిని కూడా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ‘క్లీన్‌ యమున’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం ఓ పబ్లిక్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కేజ్రీవాల్‌తో పాటు కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, హర్ష వర్ధన్‌లు కూడా హాజరయ్యారు.

కార్యక్రమం జరుగుతుండగా ముందు వరుసలో కూర్చున్న కొందరు వ్యక్తులు కేజ్రీవాల్‌ అనారోగ్యాన్ని ఎత్తి చూపుతూ దగ్గడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడ కాస్తా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తనను ఎగతాళి చేయడం కోసమే వారు అలా చేస్తున్నారని కేజ్రీవాల్‌కు అర్థమైనప్పటికి ఆయన మౌనంగానే ఉన్నారు. అప్పుడు అక్కడే ఉన్న బీజేపీ మంత్రులు నితిన్‌ గడ్కరీ, హర్ష వర్ధన్‌ దగ్గుతున్న వారి దగ్గరకు వెళ్లి ‘ఇది పబ్లిక్‌ మీటింగ్‌.. దయ చేసి మౌనంగా ఉండండ’ని విజ్ఞప్తి చేశారు. దాంతో పరిస్థితి కాస్తా సద్దుమణిగింది. కేజ్రీవాల్‌కు 40 ఏళ్ల నుంచి దగ్గు సమస్య ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అది బాగా ఎక్కువయ్యింది. చికిత్స నిమిత్తం కేజ్రీవాల్‌ 2016, సెప్టెంబర్‌లో బెంగళూరు వెళ్లి ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు.

మరిన్ని వార్తలు