అవినీతి, మతతత్వంపై పోరు

22 Sep, 2017 01:16 IST|Sakshi
అవినీతి, మతతత్వంపై పోరు

► చేతులు కలిపిన కమల్, కేజ్రీవాల్‌
► చెన్నైలో ఇరువురి భేటీ


సాక్షి, చెన్నై: తెగువ, సాహసమున్న వ్యక్తి కమల్‌హాసన్‌ అని, ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభిలషించారు. చెన్నైలో కమల్‌తో ఆయన గురువారం ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై చర్చించారు. మతతత్వ, అవినీతి శక్తులకు ఎదురొడ్డి కమల్‌హాసన్‌ ముందడుగు వేశారని కేజ్రీవాల్‌ కొనియాడారు. కమల్‌ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వీరిద్దరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై అల్వార్‌పేట్‌లోని కమల్‌ ఇంట్లో వారిద్దరు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘దేశం అవినీతి, మతతత్వం వంటి బలమైన శక్తులతో పోరాడుతున్న వేళ.. ఒకే విధమైన భావజాలం కలిగిన వ్యక్తులు ఆ అంశాలపై చర్చించి, కలిసికట్టుగా ముందుకు సాగడం చాలా అవసరం’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. నటుడిగా, వ్యక్తిగా కమల్‌హాసన్‌కు తాను అభిమానినని కేజ్రీవాల్‌ అన్నారు. ‘తెగించే సాహసం, ధైర్యమున్న ప్రజలు చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి వారిలో కమల్‌ హాసన్‌ ఒకరు. ఆయన రాజకీయాల్లో రావాలి’ అని కోరారు.
కమల్‌ కూడా కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. జాతీయ స్థాయిలో అవినీతి, మతతత్వంపై పోరాడిన నేతగా అభివర్ణించారు.

‘నాకు అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. అందువల్ల దేశంలో, తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాలనుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కేజ్రీవాల్‌ రాకను నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మతతత్వం, అవినీతిపై పోరా డే ఎవరి నుంచైనా సలహాలు స్వీకరిస్తాను’ అని కమల్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు చెన్నై విమానాశ్రయంలో కమల్‌ చిన్న కుమార్తె అక్షర హాసన్‌ స్వాగతం పలికారు. కమల్‌హాసన్‌ను ఆప్‌లో చేర్చుకుని తమిళనాడులో ఆ పార్టీ జెండా ఎగరేయడమే కేజ్రీవాల్‌ రాక ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. గతేడాది కమల్‌హాసన్‌ ఢిల్లీ వెళ్లినపుడు కూడా కేజ్రీవాల్‌ను కలవడం గమనార్హం.

మరిన్ని వార్తలు