హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!

19 May, 2017 17:39 IST|Sakshi
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!

హవాలా స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. ముఖేష్ కుమార్ అనే ఢిల్లీ వ్యాపారవేత్త ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చానని చెప్పడం అంతా అబద్ధమేనని కొట్టిపారేశారు. ఇదంతా నల్లధనాన్ని తెల్లగా మార్చుకోడానికి చేసిన ప్రయత్నమేనని మిశ్రా అన్నారు. ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆయన చెప్పారు. నాలుగు షెల్ కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల మొత్తం చెక్కుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి వచ్చిందని ఐదు రోజుల క్రితం మిశ్రా ఆరోపించారు. అయితే దీన్ని ముఖేష్ కుమార్ అలియాస్ ముఖేష్ శర్మ ఖండించారు. తాను స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ డబ్బులను విరాళంగా ఇచ్చానన్నారు. పేదలకు సేవ చేయడానికే ఆమ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వస్తోందని భావించి, అందుకు సాయపడాలనే తాను ఇచ్చినట్లు ఆయన ఒక వీడియో సందేశంలో చెప్పారు.

ఆ వీడియోను అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఆ నాలుగు కంపెనీలు ఈ వ్యక్తివేనని, తాము ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీకి విరాళం ఇచ్చాడని అన్నారు. కానీ ముఖేష్ కుమార్/శర్మ పూర్తి నిజాలు బయట పెట్టడంలేదని మిశ్రా తాజాగా అంటున్నారు. అతడు రూ. 2 కోట్లు ఇవ్వలేదన్న విషయాన్ని తాను నిరూపించగలనని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 లక్షల చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ఉన్న నాలుగు లేఖలను ఆయన చూపించారు. వాటిలో రెండింటిమీదే శర్మ సంతకాలు ఉన్నాయన్నారు. అంటే శర్మ కేవలం కోటి రూపాయలే ఇచ్చారని, మిగిలిన కోటి ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు.

గత నెలలో జరిగిన మునిసిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందే ఆ 2 కోట్ల విరాళం వచ్చిందని, ఇది మరింత ప్రశ్నార్థకంగా ఉందని కపిల్ మిశ్రా అన్నారు. ఆదాయపన్ను శాఖ కేజ్రీవాల్‌ను దాని గురించి అడిగితే, ఎక్కడినుంచి వచ్చాయో తెలియదన్నారని చెప్పారు. మొత్తం 16 షెల్ కంపెనీలను ఉపయోగించుకోవడం ద్వారా కేజ్రీవాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు