పేరెంట్స్‌ను పోలీసుల్ని చేస్తానంటున్న కేజ్రివాల్‌

19 Jan, 2018 14:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, తరగతి గదుల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్నది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌కు ఎప్పటి నుంచో మదిలో మెదులుతున్న ఆలోచన. 2015లో విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు జరిపినప్పుడు ఆయన తొలిసారిగా తన ఈ ఆలోచనను బయటపెట్టారు. పాఠశాలలకు వెళ్లిన తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఇంటివద్ద నుంచి ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు వీక్షించేందుకు ఇది తోడ్పడుతోందని, అందుకోసం అవసరమైన ఆప్‌ను కూడా తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఎందుకో ఆయన చాలాకాలం ఈ విషయాన్ని మరచిపోయారు. గురుగావ్‌లోని పాఠశాలలో నవంబర్‌ నెలలో ఓ విద్యార్థి హత్య జరగడంతో సీసీటీవీ కెమేరాల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సాధ్యమైనంత త్వరగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన విద్యాశాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయడంలో అనేక ఆచరణపరమైన సమస్యలతోపాటు నైతిక సమస్యలు ఎదురవుతాయన్న విషయాన్ని అరవింద్‌ కేజ్రివాల్‌గానీ, ఆయన అధికారులుగానీ ఎందుకు ఆలోచించడంలేదో అర్థం కావడం లేదు.
 
పాఠశాలల్లో, తరగతి గదుల్లో ఏర్పాటు చేసే కొన్ని లక్షలాది సీసీటీవీ కెమేరాలను ఎవరు పర్యవేక్షించాలి? అందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటుందా? విద్యార్థుల మనస్తత్వం గురించి అవగాహన కలిగిన సిబ్బందిని నియమిస్తారా? ఎంత మంది అవసరం అవుతారు? వారి జీతాల కోసం ఎంత డబ్బును వెచ్చిస్తారు? పాఠశాలల్లో కనీస అవసరాలైన మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలకు నిధులు లేవని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం, నిఘా సిబ్బంది జీతాలకు ఎక్కడి నుంచి నిధులను తెస్తుంది? టీచర్ల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో కోట్ల రూపాయలతో సీసీటీవీ కెమేరాలు పెట్టడం సాధ్యం అయ్యేపనేనా? ప్రభుత్వ పాఠశాలల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తామంటే ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? తరగతి గదులకు వాటిని పరిమితం చేస్తారా? అన్ని చోట్ల ఏర్పాటు చేస్తారా? నోయిడా పాఠశాలల్లో జరిగిన లాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండేందుకు సీసీటీవీ కెమేరాలు అవసరమని అరవింద్‌ కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. నోయిడాలో విద్యార్థిని రేప్‌చేసి హత్యచేసిన సంఘటన టాయ్‌లెట్‌లో జరిగింది. అంటే టాయ్‌లెట్‌లో కూడా సీసీటీవీ కెమేరాలు పెడతారా?
 
ఇక తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద నుంచి ఎప్పటికప్పుడు పాఠశాలల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఆప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో తిలకించవచ్చంటున్నారు. వారు ఏ సమయంలో తమ పిల్లలను పర్యవేక్షించాలి? ఇంటి పనులు మానుకొని అన్ని వేళలా పర్యవేక్షించాలా? అసలు తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించడమేమిటీ? అది మోరల్‌ పోలిసింగ్‌ కాదా? టీచర్లపై అపనమ్మకాన్ని పెంచదా? పిల్లలు పాఠశాలకు వచ్చేది కేవలం చదువుకోసమే కాదు. ఆటపాటల కోసం, వాటితో ముడివడి ఉన్న ఆత్మీయత కోసం. సామాజికంగా చెప్పాలంటే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా సమాజంలో తాము స్వతంత్రంగా ఎదిగేందుకు, బతికేందుకు బడి తోడ్పడుతుందని వస్తారు. ఏ తల్లిదండ్రులైనా బాల్యం దాటుకునే వచ్చినప్పటికీ నేటి కార్పొరేట్‌ విద్యా వ్యవస్థలో తమ పిల్లలకు మంచి బాల్యం ఉండాలని కోరుకోరు. తాము అనుకున్న మంచి భవిష్యత్తునే కోరుకుంటారు.

పాఠశాలలకు వెళ్లిన తమ పిల్లలు చదువుకోకుండా ఆడుకుంటున్నారని, అల్లరి చేస్తున్నారని సీసీకెమేరాల ద్వారా చూసినప్పుడు తల్లిదండ్రుల ఆందోళన రెట్టింపు అవడమేకాదు. ఇంటికొచ్చాక వారి తాటతీసే తల్లిదండ్రులు లేకపోరు. సీసీకెమేరాలను ఏర్పాటు చేయడం మంటే తల్లిదండ్రులను పోలీసులను చేయడమే. ప్రత్యక్షంగా ప్రజలు పర్యవేక్షించే ప్రభుత్వం ఉండాలని ఉన్నత చదువులు చదివిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ కోరుకుంటారు. ఈ ఆలోచనను ఆయన గతంలో రెండు, మూడు సార్లు బయటపెట్టారు కూడా. అందులో భాగంగానే ఆయనకు ఈ సీసీటీవీ కెమేరాల ఆలోచన వచ్చి ఉంటుంది. నిజంగా ప్రజలు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా ప్రభుత్వ పాలన కొనసాగాలని ఆయన కోరుకుంటే, అందుకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఢిల్లీ సచివాలయంలో, కీలకమైన ప్రభుత్వ భవనాల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రభుత్వ సిబ్బంది పనితీరును ప్రజలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశాన్ని కల్పించాలి.

మరిన్ని వార్తలు