‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

30 Sep, 2019 17:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీయేతర ప్రజలు కూడా తమ రాష్ట్రానికి వచ్చి ఉచితంగా వైద్యం పొందుతున్నారు.. ఇది ఎక్కడి న్యాయం అంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. వివరాలు.. మంగోల్‌పురి ప్రాంతంలోని సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రిలో ట్రామా సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్‌.. ‘ప్రస్తుతం ఢిల్లీలో వైద్య సేవలు బాగా మెరుగుపడ్డాయి. దాంతో ఢిల్లీకి వచ్చే రోగుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఢిల్లీ వాసులకు వైద్యం అందడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మెరుగైన వైద్యం లభిస్తుండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికే వస్తున్నారు. దాంతో ఢిల్లీవాసులకు వైద్యం ఆలస్యం అవుతోంది’ అన్నారు.

‘ఉదాహరణకు బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం రూ.500 పెట్టి టికెట్‌ కొని ఢిల్లీ వచ్చి.. రూ. 5లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నాడు. అంటే ఢిల్లీ ప్రజలకోసం ఉద్దేశించిన వాటిని ఇతరులు కూడా వినియోగించుకుంటున్నారు. వారు కూడా మన దేశ ప్రజలే కాబట్టి.. మనం అభ్యంతరం తెలపం. కానీ ఢిల్లీ దేశ ప్రజలందరికి సేవ చేయలేదు కదా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మాటలు మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఓటమి భయంతో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని విమర్శించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు