ఢిల్లీలో ఎన్‌ఆర్‌సీ.. కేజ్రీవాల్‌ స్పందన

25 Sep, 2019 14:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక వేళ దేశ రాజధానిలో గనక  భారత పౌరులను గుర్తించే ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌’ను అమలు చేస్తే.. బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీనే తొలుత ఢిల్లీ నుంచి వెళ్లి పోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. అసోం తరహాలోనే ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో అద్దెకుంటున్న వారికి కూడా వర్తించే పవర్‌ సబ్సిడీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు కేజ్రీవాల్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకవేళ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని వర్తింపజేస్తే.. మనోజ్‌ తివారీనే ముందుగా ఢిల్లీ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.
(చదవండి: మిమ్మల్ని టచ్‌ చేయాలంటే నన్ను దాటాలి!)

అసోంలో ఎన్‌ఆర్‌సీ అమలు చేసిన సందర్భంగా ఢిల్లీలో కూడా అమలు చేయాలని మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేస్తున్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా ఢిల్లీలో ప్రవేశించారని.. వారి వల్ల రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు మనోజ్‌ తివారి. వారిని రాష్ట్రం నుంచి పంపించడానికి ఢిల్లీలో కూడా ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని మనోజ్‌ తివారి డిమాండ్‌ చేశారు. ఎన్‌ఆర్‌సీ అమలు రాజకీయ పార్టీల మధ్య విబేధాలు సృష్టిస్తోంది. విపక్షాలు ఎన్‌ఆర్‌సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోను తమ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సీని అమలు చేయమని.. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు