మహిళల రక్షణ కోసం 13వేల మంది మార్షల్స్‌

28 Oct, 2019 16:21 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌(డిటిసి) బస్సులో ప్రయాణం చేసే మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు మంగళవారం నుంచి మరో 13వేల మంది మార్షల్స్‌ పనిచేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం తెలిపారు. ఇప్పటికే మహిళలకు రక్షణగా 3400 మంది మార్షల్స్‌ పనిచేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎంపిక చేసిన 13 వేలమంది మార్షల్స్‌ మంగళవారం నుంచే విధుల్లో చేరతారని ఆయన స్పష్టం చేశారు. దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో మహిళలకు కనీస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇది మా ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ నగరంలో లేని విధంగా మేము మహిళలకు రక్షణగా మార్షల్స్‌ను నియమించామని తెలిపారు. 'ఈ రోజు మీ అందరిముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతీ మహిళకు రక్షణ కల్పించడమే మీ బాధ్యత. ఇది చూసి ప్రతీ మహిళ ప్రభుత్వ బస్సును సొంత వాహనంగా భావించేలా విశ్వాసం కల్గిస్తారని ఆశిస్తున్నా' అంటూ కొత్తగా ఎంపిక చేసిన మార్షల్స్‌తో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రభుత్వం రూపొందించడానికి ఒక రోజు ముందు ముఖ్యమంత్రి నుంచి ఈ ప్రకటన రావడం విశేషం.

మరిన్ని వార్తలు