కేంద్రానికి కృతజ్ఞతలు: కేజ్రీవాల్‌

27 Jun, 2020 16:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కోరలు చాస్తున్న మహమ్మారితో పోరాడేందుకు ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను సవరించిన ఆప్‌ ఆద్మీ ప్రభుత్వం కొత్తగా 5 ఆయుధాలను కూడా ఉపయోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడక గదుల సంఖ్యను పెంచడంతో పాటు కరోనా వ్యాధి చికిత్సలో భాగంగా ఐసోలేషన్, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సాంద్రతలు, ప్లాస్మా థెరపీలతో పాటు సర్వే, స్క్రీనింగ్ పద్ధతులను పాటిస్తు‍న్నట్లు చెప్పారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడుతూ.. ‘మహమ్మారితో యుద్దంలో అడుగడుగునా సాయం చేస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా కేసులు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. కానీ అంచనాకు మించి కేసులు పెరిగాయి. దీంతో కరోనాను అరికట్టేందుకు మా ముందు రెండే మర్గాలు ఉన్నాయి. తిరిగి లాక్‌డౌన్‌ను విధించడం లేదా కరోనాతో యుద్దం చేయడం. ఇక ప్రజలక కోరిక మేరకు లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. (హోం క్వారంటైన్‌.. కొత్త మార్గదర్శకాలు)

కరోనా పోరాటంలో వాడే 5 ఆయుధాలు ఇవే: సీఎం
ఐసోలేషన్‌.. ఇందుకోసం తమ ప్రభుత్వం రాష్ట్రంలోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కోవిడ్‌-19 బాధితుల కోసం కనీసం 40 శాతం బెడ్‌లను కేటాయించి కోవిడ్‌ నివారణ కేంద్రాలుగా మార్చింది. అంతేగాక హోటల్స్‌ను కూడా కరోనా కేందద్రాలకు కేటాయించడంతో ఇప్పుడు బెడ్‌ల సంఖ్య 13,500కు చేరిందని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.

యాంటిజెన్‌ కిట్లు.. వీటి సాయంతో జూన్‌ మొదటి వారంలో రోజుకు 5 వేల కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు ప్రతిరోజు దాదాపు 20 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా యాంటిజెన్‌ కిట్లను ఆర్డర్‌ చేసినట్లు ఆయన చెప్పారు. 

పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ సాంద్రత కిట్లు... ఈ కిట్లు కోవిడ్‌ రోగులకు భద్రతా కవచంగా పనిచేస్తాయి. రోగి ఆక్సిజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. ఒకవేళ శ్వాసకోశ ఇబ్బంది ఎక్కువై వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే హెచ్చరిస్తుంది. క్వారంటైన్‌లో ఉన్న ప్రతి రోగి ఇంటికి ఈ పరికరాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 4 వేలకు పైగా ఆక్సి కిట్లను కొనుగోలు చేశామన్నారు. (క‌రోనా : సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన గోవా ముఖ్య‌మంత్రి)

ప్లాస్మా థెరపి.. ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇది వెంటిలేటర్లపై ఉన్న రోగులకు లేదా బహుళ అవయవ వైఫల్యం ఉన్న రోగులకు పని చేయదు. కానీ స్వల్ఫ లక్షణాలతో ఉన్నవారికి సహయపడుతుందన్నారు. కరోనాను నివారణకు చివరగా వాడే ఐదవ ఆయుధం సర్వే, స్క్రీనింగ్ అని చెప్పారు. శనివారం నుంచి ఢిల్లీలో 20 వేల మందికి సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. చివరిగా తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మీడియాను ఉద్దేశిస్తూ... ‘‘మా తప్పులను ఎత్తిచూపి అర్థమయ్యేలా చేసిన మీడియాకు ధన్యవాదాలు. కరోనాపై యుద్ధంలో తర్వలో మా ప్రభుత్వం గెలుస్తుంది. కానీ ఎప్పుడన్నది చెప్పలేము. అయితే గెలవడం మాత్రం ఖాయం’’ అని అన్నారు. (‘టెస్టింగ్‌ సామర్థ్యం మూడింతలు’)

మరిన్ని వార్తలు