ఎల్జీ ఆదేశాలను అమలు చేస్తాం: కేజ్రీవాల్‌

10 Jun, 2020 14:05 IST|Sakshi
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: వివక్షకు తావు లేకుండా ప్రతీ ఒక్కరికి చికిత్స అందించాలన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్ ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలు, వాదనలకు ఇది సమయం కాదని.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జారీ చేసిన ఉత్వర్వులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్జీ ఆదేశాలను తప్పక అమలు చేస్తాం. భేదాభిప్రాయాలకు, వాదనలకు సమయం కాదిది’’ అని పేర్కొన్నారు. కాగా దేశ రాజధానిలో కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్‌ 15 నాటికి 44 వేలు, జూన్‌ 30 నాటికి 2.25 లక్షలు, జూలై చివరి నాటికి 5.5 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.(కేజ్రీవాల్‌ వింత నిర్ణయం.. ఎల్జీ ఉత్తర్వులు)

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని పడకలను ఢిల్లీ వాసులకే కేటాయిస్తామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఆస్పత్రుల్లో బెడ్స్‌ అందరూ వాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్థానికేతరులకు చికిత్స అందించబోమన్న కేజ్రీవాల్‌ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక కేజ్రీవాల్‌ ప్రకటనపై స్పందించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికి చికిత్స అందించాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన జీవించే హక్కులో ఆరోగ్యంగా జీవించే హక్కు అంతర్భాగమని సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పుల్లో వెల్లడించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. (మరో పదివేల కేసులు )

మరిన్ని వార్తలు