రేపు మోదీని కలవనున్న కేజ్రీవాల్

11 Feb, 2015 10:49 IST|Sakshi
రేపు మోదీని కలవనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 10.30లకు ఆయన మోదీని కలవనున్నట్టు ఆప్ తెలిపింది. కేజ్రీవాల్  ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్టు ఆప్ పేర్కొంది.


కాగా, 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో 49 రోజులకే 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన సరిగ్గా సంవత్సరం తరువాత ఈ ఫిబ్రవరి 14న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం విశేషం. ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన అరవింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సమీప బీజేపీ ప్రత్యర్థి నుపుర్ శర్మపై 31,583 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియాకు డిపాజిట్ కూడా దక్కలేదు.

మరిన్ని వార్తలు