బ్లాక్‌ మార్కెటింగ్‌ విషయలో కఠినంగా ఉంటాం

6 Jun, 2020 15:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో  రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం కష్టతరంగా మారుతోంది. సరిపడినన్ని బెడ్స్‌ లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అవకాశంగా మలుచుకుంటున్నాయి. బెడ్‌లు అందుబాటులో ఉన్నప్పటికి లేవంటూ బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడున్నాయి. ఈ విషయం పై ఢిల్లీ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. రాజధానిలో ఆసుపత్రులేవైన ఇలాంటి బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడి, బెడ్‌ల అందుబాటు విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. (వారి కోసం 5 వేల పడకలు సిద్ధం)

బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఒక మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసిందని వెల్లడించారు. దీనిలో ఎప్పటికప్పడు ఆసుపత్రిలో ఉన్న బెడ్‌ల వివరాలను ఆసుపత్రులు నమోదు చేయాలని చెప్పారు. వాటి ఆధారంగా ప్రజలకు ఏ ఏ ఆసుపత్రుల్లో బెడ్‌లు ఖాళీగా ఉండి అందుబాటులో ఉన్నాయో తెలుస్తుందన్నారు. ఈ యాప్‌లో అందుబాటులో ఉన్న బెడ్‌ వివరాల గురించి తప్పుడు సమాచారం ఇస్తే  ఆ ఆసుపత్రిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. యాప్‌లో బెడ్‌లు ఖాళీగా ఉన్నాయని చూపించి, ఆసుపత్రికి వెళ్లగా సిబ్బంది బెడ్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే  1031 నంబర్‌కు ఫిర్యాదు చెయ్యొచ్చని తెలియజేశారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ఒకసారి సాయంత్రం 6 గంటలకు మరోసారి రోజుకు రెండుసార్లు యాప్‌ను అప్‌డేట్‌ చేస్తామని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పేషెంట్ల కోసం బెడ్‌లు, వెంటీలేటర్లు, ఐసీయూ సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు కేజ్రీవాల్‌ ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌లో మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. (కరోనా: ప్రైవేటులో చార్జీలపై సుప్రీం విచారణ)

>
మరిన్ని వార్తలు