తీర్పుపై సంతృప్తి లేదు!

10 Nov, 2019 03:54 IST|Sakshi

కూల్చివేతకు గురి కాకుంటే తీర్పు ఏం వచ్చేది?

ఐదెకరాల భూమి అక్కర్లేదు.. మసీదుపై రాజీ ఉండదు

సుప్రీం తీర్పును గౌరవిస్తాం

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమిన్‌ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం హైదరాబాద్‌ శాస్త్రీపురంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారన్నారు.

తమ పోరాటం న్యాయమైన, చట్టపరమైన హక్కుల కోసమేనని, ఐదెకరాల భూమి కేటాయింపు అక్కర్లేదని, మసీదుపై రాజీపడే సమస్యే లేదని స్పష్టంచేశారు. ‘‘బాబ్రీ మసీదుకు ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంది. భవిష్యత్తు తరాలకు సైతం బాబ్రీ మసీదు అక్కడ ఉండేదని మేం చెబుతాం. 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదును కూల్చివేసిన వారినే... ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించమని సుప్రీంకోర్టు చెబుతోంది. ఒకవేళ బాబ్రీ మసీదు కూల్చివేతకు గురి కాకుంటే తీర్పు ఏం వచ్చేది?. దేశంలో అనేక ఇతర మసీదులు ఉన్నాయని, వీటిపై కూడా సంఘ్‌ పరివార్‌ దావా వేసింది.

ఆ సందర్భాల్లో కూడా ఈ తీర్పును ఉదహరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అయోధ్య నుంచి ప్రారంభమవుతోందని దుయ్య బట్టారు.  రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని పేర్కొన్నారు. తీర్పుపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డ్‌ వైఖరి ప్రకారం నడుచుకుంటామన్నారు. ‘సుప్రీంకోర్టు సుప్రీం. దాని తీర్పు ఫైనల్‌. కాకపోతే అన్నివేళలా అది కరెక్టేనని అనుకోలేం’ అన్నారాయన. అయోధ్య వివాదంలో కాంగ్రెస్‌ తీరును కూడా అసద్‌ తప్పుబట్టారు. ఆ పార్టీ వల్లే బాబ్రీ మసీదు చేజారిందని, ఆ పార్టీ నిజమైన రంగును బహిర్గతం చేసిందని విమర్శించారు.

మరిన్ని వార్తలు