మధ్యవర్తిత్వ ప్యానెల్‌లో రవిశంకర్‌ : ఓవైసీ అభ్యంతరం

8 Mar, 2019 14:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసు పరిష్కారంలో భాగంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల ప్యానెల్‌లో ఆథ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌ పేరును చేర్చడం పట్ల ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రవిశంకర్‌ స్ధానంలో తటస్థంగా వ్యవహరించే మధ్యవర్తిని సర్వోన్నత న్యాయస్ధానం నియమించాలని కోరారు. అయోధ్యపై ముస్లింలు తమ హక్కును వదిలివేయకుంటే భారత్‌ సిరియాగా మారుతుందని గతంలో రవిశంకర్‌ వ్యాఖ్యానించారని గుర్తు చేస్తూ తటస్థ వ్యక్తిని మధ్యవర్తిగా సుప్రీం కోర్టు నియమించాలని ఓవైసీ సూచించారు.

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ కలీఫుల్లా నేతృత్వంలో సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లతో కూడి త్రిసభ్య మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. కాగా, సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొదిస్తూ దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి తాము సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు కలలు సాకారమయ్యేలా ఐక్యంగా పురోగమించాల్సి ఉందని అయోధ్య వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు మధ్యవర్తుల ప్యానెల్‌ను ప్రకటించిన అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు