ఇమ్రాన్‌.. అమాయకత్వపు ముసుగు తీసేయ్‌: ఒవైసీ

24 Feb, 2019 09:34 IST|Sakshi
అసదుద్దీన్‌ ఒవైసీ

భారత్‌ ఐక్యతను పాక్‌ ఓర్వేలేకపోతుంది

పుల్వామా ఉగ్రదాడిలో పాక్‌ ఆర్మీ హస్తం

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

ముంబై : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అమాయకత్వపు ముసుగు తీసేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. పాక్‌ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందన్నారు. శనివారం ముంబైలో జరిగిన ఓ కారక్రమంలో ఒవైసీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ‘ మేం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పేది ఒక్కటే.. టీవీ కెమెరాల ముందు కూర్చొని భారత్‌కు నీతి వ్యాఖ్యలు బోధించడం కాదు. ఇది తొలి ఘటన కాదు. గతంలో పఠాన్‌ కోట్‌, ఉరి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు పుల్వామా దాడి జరిగింది. ముందు నీ అమాయకత్వపు ముసుగు తీసేయ్‌’ అని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు అసువులుబాసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు కుట్ర పాక్‌లోనే జరిగిందని ఒవైసీ తెలిపారు. ఈ ఉగ్రదాడిని పాక్‌ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీ, ఇంటెలిజెన్స్‌, ఐఎస్‌ఐలు కలిసి చేశాయన్నారు. ఈ ఉగ్రదాడి జరిపిన జైషే మొహ్మద్‌ ఉగ్రవాద సంస్థపై కూడా ఓవైసీ మండిపడ్డారు. ఇస్లాం ఎప్పుడూ ఓ మనిషిని చంపమని చెప్పలేదని స్పష్టం చేశారు.

‘40 మంది వీర జవాన్లను పొట్టన బెట్టుకున్న మీది జైషే మహ్మద్‌ సంస్థ కాదు.. జైషే సైతాన్‌. మహ్మద్‌ ఉగ్రవాది ఒక వ్యక్తిని చంపలేదు. మానవత్వంపై దాడి చేశాడు. మజ్సోద్‌ అజార్‌ మౌలానా కాదు.. దెయ్యం. అది లక్షరే తోయిబా కాదు.. లక్షరే సైతాన్‌’ అని ఓవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉన్న ముస్లింలపై పాక్‌ చింతించాల్సిన అవసరంలేదని, భారత్‌ ఐక్యతను పాక్‌ ఓర్వలేకపోతుందన్నారు.

‘పాక్‌కు చెందిన ఓ మంత్రి భారత దేవాలయాల్లో గంట మోగకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయనకు నేను ఒక విషయాన్ని చెప్పదల్చుకున్నాను. అతనికి భారత్‌ గురించి ఏమాత్రం తెలియదు. ఈ దేశానికి చెందిన ముస్లింలు బతికున్నతం కాలం మసీదుల్లో ఆజాన్‌, దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇది మా దేశం యొక్క గొప్పతనం. ఇది చూసి పాక్‌ ఓర్వేలేకపోతుంది. మేమంతా ఐక్యంగా జీవిస్తున్నాం. మా మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ.. దేశం జోలికి వస్తే మాత్రం మేమంతా ఒక్కటే.’  అని ఒవైసీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు