జీన్స్‌ ప్యాంట్, స్పోర్ట్స్‌ షూస్‌ కావాలి!

8 Oct, 2018 02:04 IST|Sakshi

ఢిల్లీ కోర్టును కోరిన ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌

కుదరదన్న న్యాయస్థానం

 ‘దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు’లో ఇతడికీ ఉరి

సాక్షి, హైదరాబాద్‌ : ‘సాధారణ కాటన్‌ దుస్తులు ధరించలేకపోతున్నా.. అవి వేసుకుంటే నా కాళ్లు, చేతులకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. కాళ్లకు ఏమీ లేకుండా తిరగడం కూడా కష్టంగా ఉంది. జైల్లో వేసుకోవడానికి నాకు జీన్స్‌ ప్యాంట్, స్పోర్ట్స్‌ షూస్‌ కావాలి’అంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ (ఐఎం) టెర్రరిస్ట్‌ అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని అన్ని కోణాల్లో విచారించిన న్యాయస్థానం అలాంటివి కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉన్న హడ్డీ 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులోనూ ఉన్నాడు. దీనికి సంబంధించి 2016లో ఉరి శిక్ష పడిన ఐదుగురిలో ఇతడూ ఒకడు. 

ఇక్కడ పూర్తికావడంతో అక్కడకు..
దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాప్‌ల్లో 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాల్పడిన ఐఎం ఉగ్రవాదుల్లో హడ్డీ ఒకడు. ఈ సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌కు హడ్డీ కుడి భుజంగా వ్యవహరించాడు. ఈ పేలుళ్ల తర్వాత నేపాల్‌లో ఉన్న యాసీన్‌ భత్కల్‌ వద్దకు పారిపోయాడు. సుదీర్ఘకాలం అక్కడే తలదాచుకున్న ఈ ఇద్దరు ఉగ్రవాదుల్నీ ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు 2013 ఆగస్టు 28న బిహార్‌లోని మోతిహరీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చి విచారించడంతోపాటు కోర్టులో అభియోగపత్రాలూ దాఖలు చేశారు. ఈ కేసులను విచారించిన చర్లపల్లి జైలులోని ప్రత్యేక న్యాయస్థానం 2016 డిసెంబర్‌ 19న మొత్తం ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. వీరిలో యాసీన్‌తోపాటు హడ్డీ కూడా ఉన్నాడు. ఈ ముష్కరులు దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఇక్కడి కేసుల విచారణ పూర్తి కావడంతో ఢిల్లీ విధ్వంసాలకు సంబంధించి విచారణకు పోలీసులు అక్కడకు తరలించారు.

తీహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా..
ప్రస్తుతం హడ్డీ తీహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అయితే సిటీలో నమోదైన కేసుల్లో ఉరిశిక్ష పడటంతో ఇతడిని శిక్షపడిన ఖైదీగా పరిగణించిన అక్కడి అధికారులు జైలు దుస్తుల్ని ఇచ్చారు. అయితే వీటిని వేసుకో వడం వల్ల తన కాళ్లు, చేతులకు చర్మ వ్యాధి (అటోపిక్‌ డెర్మటైటిస్‌) సోకిందంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలోనే తాను జైల్లోనూ జీన్స్‌ ప్యాంట్, స్పోర్ట్స్‌ షూస్‌ ధరించేలా అనుమతి ఇవ్వాలని కోరాడు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం అలా కుదరదంటూ తీర్పు చెప్పింది. అలా వేసుకోవడం జైలు నిబంధనలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. కేవలం ఈ ఒక్క కారణమే కాదని.. సాధారణంగా అటోపిక్‌ డెర్మటైటిస్‌ వంటి చర్మ వ్యాధులు సోకినప్పుడు వైద్యులు తేలికైన దుస్తులు ధరించమని చెప్తారని, అలాంటిది జైలు దుస్తులు కాదని జీన్స్, స్పోర్ట్స్‌ షూస్‌ కోరడం ఏమిటంటూ ప్రశ్నించింది. జైల్లో ఉన్నన్ని రోజులూ అందరు ఖైదీల మాదిరి కాటన్‌ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. 
 

మరిన్ని వార్తలు