జేజేల నుంచి.. జైలు దాకా...!

26 Apr, 2018 08:22 IST|Sakshi

ఇదీ స్వయం ప్రకటిత స్వామిజీల తీరు

ఓ మైనర్‌ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆసారాం బాపూజీకి జోధ్‌పూర్‌ కోర్టు జీవితఖైదు విధించిన నేపథ్యంలో స్వయం ప్రకటిత బాబాలు, స్వామిజీలు, అధ్యాత్మిక గురూజీల వివాదాస్పద వైఖరి, వారు ఎదుర్కొన్న కేసులు, పడిన శిక్షలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి స్వామిజీల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. 

తల్లితండ్రులను పూజించాలని, లైంగిక వాంఛలు లేని  పవిత్రమైన జీవితాన్ని గడపాలంటూ ఉపదేశాలిచ్చే 79 ఏళ్ల ఆసారాం బాపూజీ అత్యాచారం కేసులో అరెస్టయి 2013 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు.  ఆధ్యాత్మిక కేంద్రంలోనే ఆసారాం తనపై అత్యాచారం చేశారంటూ ఓ టీనేజీ భక్తురాలి ఫిర్యాదుపై ఆయన అరెస్టయ్యారు.. ఆ తర్వాత మరో మహిళా అనుయాయి కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించే ఆసారాం కుమారుడు నారాయణ్‌ సాయి కూడా అత్యాచారం ఆరోపణలతోనే కటకటాల పాలయ్యారు. 

శిక్షపడిన, కేసులు ఎదుర్కొంటున్న స్వామిజీలు కొందరు...

  • గుర్మీత్‌ రాం రహీమ్‌ :  గతేడాది ఆగస్టులో అత్యాచారం కేసులో గుర్మీత్‌సింగ్‌కు ఇరవైఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో  36 మంది చనిపోయారు. 
     
  • గంగానంద తీర్థపథ : కేరళ కొల్లాంలోని ఆశ్రమాన్ని నిర్వహించిన తీర్థపథ పూజా పద్ధతుల (ఆచారాల) నిర్వహణ నెపంతో ఓ న్యాయశాస్త్ర విద్యార్థినిని అయిదేళ్ల పాటు శారీరకంగా లొంగదీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.  దీనికి ప్రతిగా  ఆ అమ్మాయి తీర్థపథ పురుషాంగాన్ని తెగ్గోసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ప్రాయశ్చిత్తంగా తానే ఆ పని చేసినట్లు ఆయన ప్రకటించుకున్నాడు.
     
  • మెహందీ ఖాసిం : ఏడుగురు అమ్మాయిలను రేప్‌ చేసినందుకు 43 ఏళ్ల మెహందీ బాబాకు ముంబై కోర్టు 2016 ఏప్రిల్‌లో జీవితఖైదు విధించింది. మానసిక వికలాంగులైన అబ్బాయిలను ఆరోగ్యవంతులను చేసే చికిత్స కోసం అమ్మాయిలను కూడా పంపించాలని, తాను చేసే చికిత్స ద్వారా ఈ అమ్మాయిలు మానసిక వికలాంగులకు జన్మనివ్వకుండా నివారించవచ్చునని వారిపై అత్యాచారం జరిపాడు.
     
  • సంతోష్‌ మాధవన్‌ అలియాస్‌ స్వామి అమృత చైతన్య : ముగ్గురు మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసిన కేసులో మాధవన్‌కు 2009లో  కేరళ కోర్టు 16 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలను ఏదో నెపంతో రప్పించి, వారిని నిర్భందించి అత్యాచారం చేశాడు. 
     
  • స్వామి ప్రేమానంద : శ్రీలంక నుంచి 1984లో తమిళనాడులోని తిరుచిరాపల్లికి వచ్చిన ప్రేమానంద్‌ అక్కడ ఆశ్రమం నెలకొల్పాడు. ఇక్కడే అతడు తనపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చినట్లు 1994లో ఒక అమ్మాయి ఆరోపించింది. పదమూడు మంది మైనర్‌ బాలికలను రేప్‌ చేసిన కేసుల్లో ప్రేమానంద్‌తో పాటు మరో ఆరుగురికి కోర్టు శిక్ష విధించింది.
     
  • జ్ఞానచైతన్య : మూడు హత్యలకు గాను 14 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చాక ఒక బ్రిటీష్‌ కుటుంబాన్ని కలుసుకుని తన గత జన్మలో వారి కుమార్తె తన భార్యగా ఉందంటూ నమ్మించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు హింసించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు మళ్లీ ఆరెస్ట్‌ చేశారు. 
     
  • రాంపాల్‌ మహారాజ్‌ : హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు వివిధ కేసుల్లో 2014లో కోర్టు జారీచేసిన అరెస్ట్‌ వారెంట్‌ నుంచి తప్పించుకునేందుకు తన భక్తులతో రాళ్లు, పెట్రోల్‌ బాంబులు, ఇతర ఆయుధాలతో గురు రాంపాల్‌ మహారాజ్‌ దాడులు చేయించాడు. కొన్ని రోజుల తర్వాత కాని పోలీసులు ఈ భారీ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించలేకపోయారు. ఈ ముట్టడిలో ఆరుగురు చనిపోయారు. 
     
  • స్వామి నిత్యానంద : లైంగిక వేధింపులు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందపై కర్ణాటకలోని ఆశ్రమంలో తమను శారీరకంగా హింసించారంటూ అయిదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. సినీనటితో శృంగారం వీడియో వివాదం వెలుగుచూడడంతో 2010లో 53 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. ఇద్దరు మహిళలతో అసభ్య ప్రవర్తనపై ఒక స్థానిక టెలివిజన్‌ చానల్‌ వీడియో విడుదల చేయడంతో గ్రామస్తులు ఆశ్రమంపై దాడి చేశారు.

    –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు