అవి 45 రోజుల్లో మాయం

7 Apr, 2019 04:58 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి

ఏశాట్‌ శకలాలతో అంతరిక్షానికి ముప్పు లేదు

తక్కువ ఎత్తు కక్ష్యలో మిషన్‌

డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి

న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంస క్షిపణి ప్రయోగం ‘మిషన్‌ శక్తి’తో అంతరిక్షానికి ముప్పు ఉంటుందన్న నాసా వాదనల్ని భారత్‌ మరోసారి కొట్టిపారేసింది. ఈ ప్రయోగం కోసం తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యను ఎంచుకున్నామని డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి చెప్పారు. దీంతో అంతరిక్షంలోని నిర్మాణాలు, ఇతర ఆస్తులకు శకలాల బెడద లేదని వివరణ ఇచ్చారు. రాబోయే 45 రోజుల్లో ఆ శకలాలు నిర్వీర్యమవుతాయని అన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఇంటర్‌సెప్టార్‌ క్షిపణితో భూమి నుంచి 300 కి.మీ ఎత్తులోని కక్ష్య(ఎల్‌ఈవో)లో ఏశాట్‌ ప్రయోగం నిర్వహించామని తెలిపారు. కొన్ని శకలాలు పైకక్ష్యలోకి వెళ్లే అవకాశాలున్నాయని, కానీ వాటితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చే ముప్పేమీ లేదని చెప్పారు.

ప్రయోగం ముగిసిన తొలి పది రోజులు కీలకమని, ఆ గడువు సజావుగా ముగిసిందని ఆయన వెల్లడించారు. ఆ క్షిపణికి వేయి కిలో మీటర్ల పరిధిలో గల లక్ష్యాలను కూడా తాకే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఒకే సారి ఒకటి కన్నా ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే సత్తా ఏశాట్‌కు ఉందా? అని ప్రశ్నించగా, బహుళ లాంచర్‌లతో అది సాధ్యమేనని అన్నారు. అంతకుముందు, ఉదయం ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశమై ఏశాట్‌ ప్రయోగం గురించి వివరించినట్లు తెలిపారు. తెలివితక్కువ ప్రభుత్వాలే రక్షణ శాఖ రహస్యాలను బహిర్గతం చేస్తాయన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఏశాట్‌ గమనాన్ని ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారని, ఇలాంటి ప్రయోగాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు.

ఆరు నెలలు.. 150 మంది శాస్త్రవేత్తలు:
మార్చి 27న ఏశాట్‌ క్షిపణితో భారత్‌ తన సొంత ఉపగ్రహాన్ని కూప్పకూల్చి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రష్యా, అమెరికా, చైనా సరసన నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం 40 మంది మహిళలు సహా మొత్తం 150 మంది శాస్త్రవేత్తలు ఆరు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. 50 ప్రైవేట్‌ సంస్థల నుంచి ఇందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చాం.  ప్రయోగం నిర్వహించాలని కేంద్రానికి 2014లో ఆలోచన వచ్చినా 2016లో అనుమతిరావడంతో ఏర్పాట్లు చేశారు. ప్రయోగం విజయవంతంగా ముగిశాక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్పందిస్తూ ఏశాట్‌ ప్రయోగంతో అంతరిక్షంలో 400 శకలాలు పోగయ్యాయని ఆక్షేపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు