‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’

19 Mar, 2020 12:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయకు రేపటిరోజున న్యాయం జరిగి తీరుతుందని ఆమె తల్లి ఆశాదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో ఉరి శిక్ష ఖరారైన నలుగురు దోషులకు కోర్టు పలు అవకాశాలు ఇవ్వడాన్ని ఆమె ప్రస్తావించారు. దోషులు ఎన్నో సాకులతో తమ శిక్షను వాయిదా వేసుకునే ఎత్తుగడలు కోర్టుకు తెలిసివచ్చిందని ఇక శిక్ష నుంచి వారు తప్పించుకోలేరని అన్నారు. నిర్భయకు రేపటిరోజున న్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. నిర్భయ కేసులో తనకు విధించిన మరణ శిక్షను సవాల్‌ చేస్తూ పవన్‌ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

2012లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని, దిగువ కోర్టులు ఈ వాస్తవాన్ని విస్మరించాయని తన పిటిషన్‌లో పవన్‌ పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ను కావడంతో తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చాలని ఆయన కోరారు. అంతకుముందు ఇదే వాదనతో పవన్‌ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 2012, డిసెంబర్‌ 16న కదులుతున్న బస్సులో వైద్య విద్యార్ధినిపై హత్యాచార ఘటనలో ఉరి శిక్ష పడిన నలుగురు నిందితుల్లో పవన్‌ ఒకరు. నిర్భయ దోషులకు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి శిక్ష, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే.

చదవండి : నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి

మరిన్ని వార్తలు