ఉద్ధవ్‌తో భేటీకి కాంగ్రెస్‌ నేతలు సన్నద్ధం

14 Jun, 2020 12:43 IST|Sakshi

విభేదాలు నిజమే : అశోక్‌ చవాన్‌

ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్‌-శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మంత్రి అశోక్‌ చవాన్‌ అంగీకరించారు. విభేదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కావాలని కాంగ్రెస్‌ కోరుతోందని చెప్పారు. మరో రెండు రోజుల్లో సీఎం కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహావికాస్‌ అగడి భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అంశాలున్నాయని, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు తాము సీఎంతో రెండు రోజుల్లో భేటీ అవుతామని అశోక్‌ చవాన్‌ చెప్పారు.

కీలక సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు ఆహ్వానం అందడం లేదని కొంతకాలంగా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి సహా పలు అంశాలపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పలుమార్లు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమవుతుండగా ఈ భేటీలకు కాంగ్రెస్‌ నేతలను పిలవకపోవడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశంతో పాటు గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేషన్లు, నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ బాలాసాహెబ్‌ థోరట్‌, అశోక్‌ చవాన్‌లు సోమవారం ఉద్ధవ్‌ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం. చదవండి : మరో న్యూయార్క్‌గా మహారాష్ట్ర

మరిన్ని వార్తలు