అశోక్ చవాన్‌కు ఈసీ నోటీసు

14 Jul, 2014 01:55 IST|Sakshi
అశోక్ చవాన్‌కు ఈసీ నోటీసు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చిక్కుల్లో పడ్డారు. చెల్లింపు వార్తల వ్యవహారంలో ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది. ఆయనపై అనర్హత వేటు ఎందుకు వేయరాదో చెప్పాలంది. 2009లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చవాన్ సీఎంగా ఘనతలను ప్రస్తావిస్తూ వార్తాపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.

ఇవి చెల్లింపు వార్తల కింద పరిగణించి ఇందుకైన మొత్తాన్ని ఆయన ఎన్నికల వ్యయంలో కలపాలన్న ఫిర్యాదుకు సంబంధించి చవాన్ ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఒకవేళ ఈసీ కనుక చవాన్‌పై అనర్హత వేటు వేస్తే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశముంది. కాగా, చెల్లింపు వార్తలకు మీడియా జాగ్రత్తగా ఉండాలని ఈసీ హెచ్చరించింది.
 
 

మరిన్ని వార్తలు