మరాఠ్వాడా బాధ్యతలు అశోక్‌చవాన్‌కు

4 Jul, 2014 22:58 IST|Sakshi

ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి కాంగ్రెస్ కసరత్తుల జోరు పెంచింది. మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించి ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి, నాందేడ్ ఎంపీ అశోక్‌రావ్ చవాన్‌కు శుక్రవారం అప్పగించారు. మధుకర్ చవాన్, రాజేంద్ర దర్డా, అమిత్ దేశ్‌ముఖ్, అబ్దుల్ సత్తార్, డీపీ సావంత్‌లతో కూడిన మరాఠ్వాడా నేతల బృందానికి చవాన్ నేతృత్వం వహిస్తారు. 2010లో ఆదర్శ్ కుంభకోణంలో చవాన్‌పై కూడా ఆరోపణలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే.

 ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ ఎంపీగా పోటీ చేసిన చవాన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసిన 26 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి అశోక్‌చవాన్ బరిలో నిలిచిన నాందేడ్ కాగా మరొకటి రాజీవ్ సతావ్ బరిలో నిలిచిన హింగోళి. గెలిచిన రెండు స్థానాలు కూడా మరాఠ్వాడా ప్రాంతంలోనివే కావడం గమనార్హం. అంతటి మోడీ ప్రభంజనంలో కూడా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పేందుకు ఈ రెండు నియోజకవర్గాల్లో విజయమే ఉదాహరణ.

దీంతో ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలను అసెంబ్లీ ఎన్నికలనాటికి పూర్తి సమాయత్తం చేయాలని భావించిన అధిష్టానం ఇక్కడి ప్రజల సమస్యలు, కులాల వారీగా రిజర్వేషన్లు, రహదారుల సమస్యలు, రైతుల సమస్యలను గుర్తించి, ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యత అశోక్‌చవాన్ నేతృత్వంలోని బృందానికి అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తీసుకున్న మొదటి నిర్ణయం దాదాపుగా ఇదేనని చెప్పవచ్చు. ఈ రీజియన్‌లో 46 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.

 ఇదిలాఉండగా ఈ ప్రాంత సమస్యల విషయమై సీఎం చవాన్, ఎంసీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్ తదితరులు అశోక్‌చవాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను చవాన్ వారికి వెల్లడించినట్లు సమాచారం. వాటిలో స్థానిక సమస్యలతోపాటు మరిన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడం, ఆలయాలు, ప్రార్థనా స్థలాలకు నిధులను పెంచడం, రైతుల సమస్యలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు