వాటిని లేహ్‌కు తీసుకెళ్తానన్న ఆర్మీ జవాను

24 Jan, 2020 08:51 IST|Sakshi

న్యూ ఢిల్లీ: గతేడాది ఉల్లిపాయ ధరలు ఆకాశన్నంటగా ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చాయి. అయితే కొన్నిప్రాంతాల్లో ఉల్లి సమస్య ఇంకా వెంటాడుతూనే ఉందడానికి ఇక్కడ చెప్పుకునే ఘటనే నిదర్శనం. జమ్ముకశ్మీర్‌లో లేహ్‌ జిల్లాలో లడక్‌ స్కౌట్‌లో నయూబ్‌ సుబేదార్‌గా మ్యుటప్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1985లో దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన అశోక్ చక్ర గ్రహీతను అందుకున్నారు. ఈ ఆర్మీ హీరో ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకున్నారు.

అయితే ఆయన ఢిల్లీ నుంచి లేహ్‌కు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు తనవెంట ఉల్లిని తీసుకెళతానని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కేవలం రూ.60కే ఉల్లి దొరుకుతోంది. కానీ లేహ్‌లో కిలో ఉల్లి ధర రూ.200ను దాటిపోయింది. అందుకే ఈ నెల 31న నేను తిరిగి వెళ్లేటప్పుడు దాదాపు ఏడెనిమిది కిలోల ఉల్లిని తీసుకెళ్తాను. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లాలని ఉన్నా పరిమిత బరువుల నిబంధన మేరకు ఆ ఆలోచన విరమించుకున్నా’నని పేర్కొన్నారు. త్వరలోనే ఉల్లి రేట్లు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఆయన ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవళ్లు కూడా ఆర్మీలోనే చేరటం విశేషం.

వర్షాలతో ఉల్లికి దెబ్బ..
గతేడాది ఆగస్టు- సెప్టెంబర్‌లో ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో భారీ వర్షాలతో పంట చేతికిరాలేదు. దీంతోపాటు ఉల్లిని పండించే మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వర్షాలు ఉల్లి దిగుబడిని దెబ్బతీశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లికొరత ఏర్పడింది. సాధారణంగా రూ.20 లేదా రూ.30కి లభించే ఉల్లిపాయలు ఒక్కసారిగా కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పలికాయి. ఈ క్రమంలో జమ్ము, కశ్మీర్‌లోని లేహ్‌ ప్రాంతంలోనూ ఉల్లి ధరలు చుక్కలను తాకాయి. ఇక ఈమధ్యే ఉల్లిధరలు దిగివచ్చినప్పటికీ లేహ్‌లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతుండటం గమనార్హం.

చదవండి:

జామా మ‌సీదు ముందు చంద్రశేఖర్ ఆజాద్ ప్ర‌త్య‌క్షం

‘షి’పబ్లిక్‌డే

మరిన్ని వార్తలు