అస్సాం, అరుణాచల్‌కు వరద ముప్పులేదు: చైనా

23 Oct, 2018 02:44 IST|Sakshi

బీజింగ్‌: యార్లుంగ్‌ సాంగ్పో (బ్రహ్మపుత్ర) నది ప్రవాహం తిరిగి సాధారణ స్థాయికి వచ్చిందని, ఇక అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌కు ఎలాంటి వరద ముప్పు లేదని చైనా సోమవారం ప్రకటించింది. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు భారత్‌కు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించింది. టిబెట్‌లో భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న యార్లుంగ్‌ స్పాంగ్పో నదికి అడ్డంగా భారీ కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో నదీ మార్గం మూసుకుపోయి ఈ నెల 17న కృత్రిమ సరస్సు ఏర్పడి నీటి ప్రవాహం తగ్గింది. కానీ, కొండచరియలు తొలగించిన అనంతరం ఒక్కసారిగా ప్రవాహం పెరిగి అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌కు వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు చైనా ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

సాధారణ స్థితికి వచ్చింది.. 
‘అక్టోబర్‌ 20 నాటికి నది ప్రవాహం సాధారణ స్థితికి వచ్చింది. కొండచరియల స్థితిగతులపై నిరంతరం భారత్‌కు సమాచారం అందిస్తున్నాం’అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు. సోమవారం వరకు అరుణాచల్‌కు వస్తున్న వరద ఉధృతిని భారత్‌కు తెలిపామన్నారు. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏటా వరదల సీజన్‌లో మే 15 నుంచి అక్టోబర్‌ 15 వరకు బ్రహ్మపుత్రకు సంబంధించిన డేటాను చైనా భారత్‌కు తెలపాలి. వరద ముప్పును ఎదుర్కొవడానికి ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌కు ఈ డేటానే ఆధారం. అయితే, అకస్మాత్తుగా కృత్రిమ సరస్సు ఏర్పడటంతో ఒప్పంద తేదీలను పొడిగించారు.

మరిన్ని వార్తలు