శాంతి కోసం ఉమ్మడి యంత్రాంగం

22 Aug, 2014 03:51 IST|Sakshi
శాంతి కోసం ఉమ్మడి యంత్రాంగం

 అస్సాం-నాగాలాండ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం
 కేంద్ర హోం శాఖ చొరవతో ఉన్నతస్థాయి కమిటీ


గువాహటి: అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. సమస్యలు పరిష్కరించుకోవటానికి రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా ఒక ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జీలంగ్‌లతో గురువారం సమావేశమయ్యారు.

అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమవుతూ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని  ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సరిహద్దుల్లో తటస్థ బలగాలను మోహరించేందుకు యోచిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రులు ఎప్పుడు కోరినా కేంద్రం నుంచి తగిన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉరియమ్‌ఘాట్ దగ్గర సీఆర్‌పీఎఫ్ బలగాలు తగిన విధంగా విధులు నిర్వర్తించలేదన్న గొగోయ్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, నిర్దిష్ట విధి విధానాలను కేంద్ర బలగాలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్య తీసుకుంటామన్నారు.  

మౌలిక వసతులే సమస్య
సరిహద్దుల్లో వివాదానికి ప్రధాన కారణం ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవటమేనని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్తు వంటి కీలకమైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తి కావటానికి తగిన నిధులు అవసరమని ఆయన చెప్పారు. ఇందుకోసం తాము కేంద్ర సహాయాన్ని అర్థిస్తున్నామని గొగోయ్ అన్నారు. మరోవైపు.. అస్సాం, నాగాలాండ్ సమస్య ప్రభావం ఈశాన్య రాష్ట్రాలన్నింటిపైనా పడుతోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు.  
 
కర్ఫ్యూ సడలింపు
గోల్‌ఘాట్(అస్సాం): సరిహద్దుల వివాదాలతో ఉద్రిక్తతలు నెలకొన్న గోల్‌ఘాట్‌లో గురువారం సాయంత్రం  కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్టు ప్రకటించారు. సరిహద్దుల దగ్గర ఆందోళన చేస్తున్న 7 సంస్థలు తమ నిరవధిక ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గురువారం పూర్తి కర్ఫ్యూ ఉన్నప్పటికీ నుమాలీఘర్ దగ్గర 39వ నెంబరు జాతీయరహదారి పై నిరసన కారులు బైఠాయించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

మరిన్ని వార్తలు