ఆవులకు పాటలు వినిపిస్తే చా(పా)లు..

27 Aug, 2019 17:28 IST|Sakshi

‘ఫ్లూట్‌ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అని తెలుగులో పాపులర్‌ డైలాగ్‌ ఒకటుంది. దీన్ని కాస్త మార్చి ఆవు ముందు ఊదండి.. అంటున్నారో బీజేపీ నేత. పురాణాల్లోని శ్రీకృష్ణుడి మాదిరిగా ఆవు ముందు ఫ్లూట్‌ ఊదితే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా పాలు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. అస్సాం బీజేపీ ఎమ్మెల్యే దిలీప్‌ కుమార్‌ పాల్‌ శనివారం సిల్చార్‌లోని బరాక్‌ వ్యాలీలో జిరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందంటూ మంగళవారం ఆయన తన వాదనను సమర్థించుకున్నారు. గుజరాత్‌లోని ఎన్జీఓ కొన్ని సంవత్సరాల క్రితం ఒక అధ్యయనం చేపట్టిందని, వేణువు ద్వారా పలికించే రాగాలతో గోవుల్లో పాల ఉత్పత్తి పెరిగిందని శాస్త్రీయంగా నిరూపించిందన్నారు. మృదువైన సంగీతం వినిపిస్తే గోవులు సాధారణం కన్నా మూడు శాతం ఎక్కువగా పాలు ఇచ్చినట్టు 2001లో ఇద్దరు సైకాలజిస్టులు నిరూపించారని తెలిపారు. ఇక చెవులు చిల్లులు పడే సంగీతం, ఫాస్ట్‌ మ్యూజిక్‌ను అవి ఇష్టపడవని వారు పేర్కొన్నట్టుగా వెల్లడించారు.

కాగా స్వచ్ఛమైన తెల్ల పాలను ఇచ్చే విదేశీ జాతి ఆవుల పాల కన్నా లేత పసుపు రంగులో ఉండే భారతీయ ఆవుల పాలు చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయన్నారు. భారతీయ ఆవుల పాలతో తయారైన జున్ను, వెన్న వంటి ఉత్పత్తులు కూడా శ్రేష్టమైనవని పాల్ చెప్పారు. భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు ఆవులను అక్రమంగా తరలిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు గోమాతగా పూజించే ఆవుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉందని దిలీప్‌ కుమార్‌ పాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు