అస్సాం సీఎంగా సోనోవాల్ ప్రమాణం

25 May, 2016 01:42 IST|Sakshi
అస్సాం సీఎంగా సోనోవాల్ ప్రమాణం

మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం
-   ఏజీపీ, బీపీఎఫ్ నుంచి చెరో ఇద్దరికి అవకాశం
-   ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరు
-   ప్రమాణస్వీకారానికి 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు
 
 గువాహటి: అస్సాం 14 వ ముఖ్యమంత్రిగా సర్బానంద సోనోవాల్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరే ంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో ఖానాపార వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య సోనోవాల్‌తో పాటు మరో 10 మంది మంత్రులచే ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి ఆరుగురు, అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ నుంచి చెరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు.

 బీజేపీ నుంచి హిమంత బిస్వా శర్మ, చంద్రమోహన్ పటోవరి, రంజిత్ దత్తా, పరిమళ్ సుక్లా బైద్య, పల్లబ్ లోచన్ దాస్, నబ కుమార్ డోలే, ఏజీపీ నుంచి అతుల్ బోరా, కేసబ్ మహంత, బీపీఎఫ్ నుంచి పరిమళ రాణి బ్రహ్మ, రిహన్ డైమరిలు మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. బీపీఎఫ్‌కు చెందిన మంత్రులిద్దరూ బోడోలో, బీజేపీకి చెందిన సుక్లా బైద్య బెంగాలీలో ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, సురేష్ ప్రభు, రాం విలాస్ పాశ్వాన్, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, జితేంద్ర సింగ్, జయంత్ సిన్హా, కిరెన్ రిజుజు, వీకే సింగ్‌లు హాజరయ్యారు. బీజేపీ ముఖ్యమంత్రులైన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, ఆనంది బెన్ పటేల్, దేవేంద్ర ఫడ్నవిస్, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్, రఘువర్ దాస్, లక్ష్మీకాంత్ పర్సేకర్‌లతో పాటు మిత్రపక్షాల సీఎంలు ప్రకాశ్ సింగ్ బాదల్(పంజాబ్), చంద్రబాబు నాయుడు (ఏపీ), కలికో పుల్(అరుణాచల్), పీకే చామ్లింగ్(సిక్కిం)లు కూడా పాల్గొన్నారు.
 
 అస్సాంకు మరింత సహకారం: మోదీ
 సోనోవాల్ ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అస్సాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం నుంచి మరింత సహకారం అందిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా తీర్చిదిద్దుతామని, ఈశాన్య భారతంలో రాష్ట్రం ప్రధాన ఆకర్షణగా మారుతుందని, దేశం మొత్తంమ్మీద అభివృద్ధి చెందిన ప్రాంతంగా అవతరిస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్ని ‘సెవెన్ సిస్టర్స్’గా పిలిచేవారని మనకు మాత్రం అష్టలక్ష్మి (సిక్కింతో కలిపి) అని, అన్ని రంగాల్లో ఆ రాష్ట్రాల పూర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు