పరిశుభ్రతకు మారు పేరుగా 'కామాఖ్య'

20 Sep, 2016 19:08 IST|Sakshi
పరిశుభ్రతకు మారు పేరుగా 'కామాఖ్య'

గౌహతిః పరిశుభ్రతను పాటించడంలో మొదటి స్థానంలో కామాఖ్య నిలుస్తుందని అస్పాం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ తెలిపారు. స్వచ్ఛత అభియాన్ పథకం అమలులో భాగంగా ఎన్నుకున్న పది గుర్తింపు పొందిన ప్రాంతాల్లో ఒకటైన కామాఖ్యలో.. అన్నింటికన్నా ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత అభియాన్ పథకంతో గాంధీ మహాత్ముని 'క్లీన్ ఇండియా' కల నెరవేరుతుందని అస్పాం సీఎం సోనోవాల్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విధానాలను పాటించడంలో దేశంలోనే అస్పాం ముందుందన్న సోనోవాల్.. నీలాచల్ హిల్స్ లోని కామాఖ్య ఆలయం వద్ద స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్వచ్ఛత అభియాన్ ను ముందుగా దేశంలోని పది గుర్తింపు పొందిన, ధార్మిక,  ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు సోనోవాల్ తెలిపారు.

మొదటిగా ఎంపిక చేసిన పది ప్రాంతాల్లో అస్సాం లోని కామాఖ్య ఆలయం, జమ్ము కశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయం, ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ మహల్, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్, రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్, ఒరిస్సాలోని జగన్నాథ ఆలయం, మహరాష్ట్రలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఉత్తర ప్రదేశ్ లోని మణికర్ణిక ఘాట్, తమిళనాడులోని మీనాక్ఖీ ఆలయం ఉన్నట్లు సీఎం వెల్లడించారు. స్వచ్ఛత అభియాన్ పథకం అమలు చేయనున్న దేశంలోని మొత్తం 100 ప్రాంతాల్లో ముందుగా పది కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, అనంతరం మిగిలిన 90 ప్రాంతాల్లో కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను విజయవంతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరికీ ఆ కామాఖ్య దేవి దీవెనలు అందిస్తుందని, అలాగే ప్రధాని పరిశుభ్ర భారతదేశం కలను నెరవేర్చేందుకు అస్సాం ప్రత్యేకంగా కృషి చేస్తుందని సోనోవాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు