రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్

26 Jun, 2020 16:24 IST|Sakshi

గువాహ‌టి : గ‌త వారం రోజులుగా అస్సాం రాష్ర్టంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా నమోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కోవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా అత్య‌ధికంగా క‌రోనా తీవ్ర‌త ఉన్న గువాహ‌టిలోని క‌మ్ర‌ప్ మెట్రోపాలిట‌న్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు రాష్ర్ట ఆరోగ్య‌శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. జూన్ 28 నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ ఉంటుంద‌ని తెలిపారు. దీని ప్ర‌కారం అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్య‌క‌లాపాల‌తో స‌హా వాణిజ్య స‌ముదాయాలు మూసివేయాల‌ని ఆదేశించారు. కేవ‌లం మెడిక‌ల్ షాపులు, ఆసుప‌త్రులు తెర‌వ‌డానికి మాత్ర‌మే అనుమ‌తి ఉంద‌ని పేర్కొన్నారు.

అంతేకాకుండా వారాంతాల్లో (శ‌ని, ఆదివారం) అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని చెప్పారు. నేటి అర్ధ‌రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. దీని ప్ర‌కారం రాత్రి 7 నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల క‌ర్ఫ్యూ ఉండ‌నుంది. అయితే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించిన గువాహ‌టిలో ప‌రిమిత సంఖ్య‌లో బ్యాంకులకు ప్రభుత్వం అనుమ‌తినిచ్చింది. అంతేకాకుండా అంత్య‌క్రియ‌ల్లో 20 మందికి మించి పాల్గొనరాద‌ని ఉత్తర్వులో పేర్కొంది. (సేనల సన్నద్ధతపై నివేదిక)

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త ప‌ది రోజుల్లోనే 700కి పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో వైర‌స్ నియంత్ర‌ణ‌లో భాగంగా లాక్‌డౌన్‌ను విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌డిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో 276 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రాగా వీటిలో 133 కేసులు గువాహ‌టిలో నమోదయ్యాయి. ఇప్పటివ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,300కు చేరిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. (ప్లాస్మా థెరఫీకి గ్రీన్‌సిగ్నల్‌)

>
మరిన్ని వార్తలు