'5 కి.మీ. ప్రయాణానికి హెలికాప్టర్‌ బుక్‌ చేసిన మంత్రి'

30 Dec, 2019 16:13 IST|Sakshi

గువహతి: దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా వరకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హెలికాప్టర్లను వాడటం మనకు తెలిసిందే. సమయం వృథా కాకుండా.. ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటే ఇలా చేస్తారు. కానీ అసోంలోని ఓ మంత్రి మాత్రం కేవలం 5 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా చాపర్ బుక్ చేసుకున్నారు. ఆర్థిక మంత్రి హిమంత బిస్వాశర్మ ఈ పని చేశారు. ఇంత తక్కువ ప్రయాణానికి ఆయన హెలికాప్టర్ వాడటం ఆసక్తిగా మారింది. అయితే ఆయన ఇలా చేయడానికి ఓ కారణం కూడా ఉందని ఆయన అనుచరులు వెల్లడించారు.

చదవండి: వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూదేశాయ్‌

అసోం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజెన్ బోర్తాకుర్ మరణించడంతో ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమానికి అసోం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హిమంత బిస్వాశర్మ హాజరు కావాల్సి వచ్చింది. కానీ అప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు అక్కడ ఉధృతంగా నడుస్తున్నాయి. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్తలు గుహవటి- తేజ్ పూర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. రోడ్డు మార్గాన వెళితే.. ఆందోళనకారులు అడ్డుకుంటారని భావించి, ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 5 కి.మీ. దూరంలోని తేజ్‌పూర్‌కు హెలికాప్టర్ వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

చదవండి: నెలకు ఇంటి అద్దె రూ.15 లక్షలా?

మరిన్ని వార్తలు