ఉద్యోగాల్లో ప్లాస్మా దాత‌ల‌కు ప్రాధాన్యం

17 Jul, 2020 14:46 IST|Sakshi
మంత్రి హిమంత బిశ్వా శర్మ

గువా‌హ‌టి : ఈశాన్య రాషష్ట్రం అస్సాంలో క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ప్లాస్మాదాత‌లు క‌రువై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ప్లాస్మా దానాన్ని ప్రోత్స‌హించే విధంగా అస్సాం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌తో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్లాస్మా దాత‌ల‌కు  ప్రత్యేక ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గౌహ‌తిలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మమాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకే స్కోరు సాధిస్తే మొద‌ట‌గా  ప్లాస్మా దాతకే  ప్రాధాన్యత ఇస్తామని, వారికి ఇంటర్వ్యూల్లో రెండు మార్కులు అదనంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. (ప్లాస్మా దాతల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆఫ‌ర్)

ప్ర‌తీ ప్లాస్మా దాత‌కు ఓ స‌ర్టిఫికేట్ అందిస్తామ‌ని.. త‌ద్వారా భ‌విష్య‌త్తులో వారికి మొద‌టి ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని అన్నారు. ఇత‌ర రాష్ర్టాల‌నుంచి కూడా రావ‌చ్చ‌ని అస్సాం ప్ర‌భుత్వం వారికి స్వాగ‌తం ప‌లుకుంద‌ని తెలిపారు. అంతేకాకుండా ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రించ‌డంతో పాటు వారిని  ప్ర‌త్యేక అతిథిగా చూసుకుంటామ‌ని పేర్కొన్నారు. రాష్ర్టంలో అతి త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ ప్లాస్మా బ్యాంక్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని సిల్చార్, దిఫు, దిబ్రుగ స‌హా 6 ప్రాంతాల్లో ప్లాస్మా సేక‌ర‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. గువా‌హ‌టిలో ఇప్ప‌టికే ప్లాస్మా బ్యాంక్ ప్రారంభ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల గువా‌హ‌టి మెడిక‌ల్ కాలేజీ ఆసుప‌త్రిలో రోగుల‌కు ప్లాస్మా చికిత్స‌నందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,754కు చేరుకోగా 12,888 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 6,815 యాక్టివ్ కేసులున్న‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన)

మరిన్ని వార్తలు